ఆపదలో ఉన్న రోగులకు బాసటగా నిలుస్తూ అనునిత్యం వారిని కంటికి రెప్పలా కాపాడే నర్సులు, ఆరోగ్య కార్యకర్తల కృషి ఎనలేనిది. వైద్యులు పరీక్షించిన అనంతరం రోగిని సంరక్షించడం... సమయానికి ఇంజక్షన్‌లు, మందులు ఇవ్వడం వంటి పనులు నర్సులే చేస్తారు. రక్తపోటు, మధుమేహం, బరువు వంటివి ఎప్పటికప్పుడు నమోదుచేసి వైద్యులకు అందిస్తారు. గ్రామాల్లో పనిచేసే... ఎఎన్ఎమ్లదీ అలాంటి పాత్రే. కానీ మిగతా దేశాలతో పోలిస్తే నర్సులు, ఎఎన్ఎమ్ల సంఖ్య మనదేశంలో అత్యంత స్వల్పంగా కన్పిస్తోంది.
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా 22 లక్షల 72వేల 208 మంది నర్సులు, ఎఎన్ఎమ్లు ఉన్నారు. దేశంలో 5వేల85 నర్సింగ్ శిక్షణా సంస్థలుండగా... ఏటా 3.35 లక్షల మంది కొత్తగా శిక్షణ పొందుతున్నారు. ప్రతి వెయ్యిమంది జనాభాతో పోల్చిచూస్తే వీరి సంఖ్య 1.79 మాత్రమే. వైద్యుల తర్వాత అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వీరి సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరముందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నర్సులు అందించిన సేవలు అందరి అభిమానాన్ని చూరగొన్నాయి. రాష్ట్రంలో నర్సులు, ఎఎన్ఎమ్ల ఖాళీలు 8వేల వరకు ఉన్నాయి. 2011 నుంచి నర్సుల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడం లేదు. సాధారణంగా ఐసీయూ, కాన్పుల వార్డుల్లో మంచానికి ఒకరు చొప్పున, జనరల్ వార్డుల్లో నాలుగు మంచాలకు ఒకరు చొప్పున నర్సులు బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది.