కొవిడ్ ఉద్ధృతితో రాష్ట్రంలో ఆసుపత్రుల్లో పడకల లభ్యత పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రనే తేడా లేదు.. ఎక్కడికెళ్లినా పడకలు దొరక్క సామాన్యులు అల్లాడుతున్నారు. ఫోన్ చేసిన 3 గంటల్లో పడక అందిస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం 3 రోజులైనా దొరికే పరిస్థితి కన్పించడం లేదు. పడకల వాస్తవ లభ్యతను తెలుసుకునేందుకు ప్రభుత్వం రూపొందించిన ఆన్ లైన్ ఎల్ఎమ్ఎస్. పోర్టల్ ఆచరణలో నీరుగారుతోంది.
ఇదీ గుంటూరు జిల్లాలోని ఆసుపత్రుల్లో పడకలు దొరక్క జనం పడుతున్న పాట్లు. ప్రభుత్వ వైద్యశాలలతో పాటు 100కి పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే సమస్య. ఇక గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగులు, వారి బంధువుల ఇబ్బందులు వర్ణనాతీతం. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులు జీజీహెచ్‌లో పరిస్థితులకు నిట్టూర్చుతున్నారు. పడకలు దొరకని స్థితిలో వెనక్కి వెళ్లలేక.. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించలేక కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో వైద్యం అందక కొందరు ఆస్పత్రి ప్రాంగణంలోనే విగతజీవులుగా మారుతున్నపరిస్థితి. కొందరు నేలపైనే పడుకుని నిస్సహాయంగా విలపిస్తున్న దయనీయ దుస్థితి.
ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొందరిని లోపలికి పంపుతున్నారు. మిగతా వారి సంగతి దేవుడికే ఎరుక. రియల్ టైం లో పడకలు దొరికేలా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఆస్పత్రుల్లో పోర్టల్ ను అప్ డేట్ చేయడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 92 ఆస్పత్రుల పరిధిలో 5 వేల 826 పడకలకుగాను 4 వేల 219 పడకలు నిండినట్లు.. ఇంకా 1607 పడకలు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నారు. వాస్తవానికి ఎక్కడా ఇన్ని ఖాళీలు లేవు.