ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Amaravati Capital City: '19 కాదు.. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలి' - ఏసీసీఎంసీ

Public Opinion on ACCMC: అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటుపై రెండో రోజు జరిగిన గ్రామ సభల్లోనూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రాజధాని పరిధిలోని నాలుగు గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. అన్నిచోట్లా ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. సీఆర్​డీఏను విచ్ఛిన్నం చేసి అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తే రాజధాని అభివృద్ధికి విఘాతమని రైతులు అభిప్రాయపడ్డారు. మంగళగిరి కార్పొరేషన్, సీఆర్​డీఏ రద్దుపై కోర్టు కేసులు నడుస్తుంటే ఇప్పుడు అమరావతి కార్పొరేషన్‌పై గ్రామసభలు నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Public Opinion on ACCMC
Public Opinion on ACCMC

By

Published : Jan 6, 2022, 12:26 PM IST

Updated : Jan 6, 2022, 9:18 PM IST

29 గ్రామాలతో కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటుకు తీర్మానం

Public Opinion on ACCMC: అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుపై రెండో రోజూ రాజధాని గ్రామాల్లో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తొలుత తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, తర్వాత మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో గ్రామ సభలు నిర్వహించగా...కార్పొరేషన్‌ ఏర్పాటును గ్రామస్థులు వ్యతిరేకించారు. 29 గ్రామాల సంపూర్ణ రాజధానికే తాము అనుకూలమంటూ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం 29 గ్రామాలను అభివృద్ధి చేసిన తర్వాత...అన్నింటినీ కలిపే కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని..సభకు హాజరైన వారందరూ తేల్చిచెప్పారు.

ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోనూ ప్రభుత్వ ప్రతిపాదనను గ్రామస్థులు వ్యతిరేకించారు. 29 గ్రామాలతో రాజధాని ఏర్పాటు చేస్తామంటేనే అప్పుడు భూములు ఇచ్చామని..ఇప్పుడు సీఆర్​డీఏ కాదని అమరావతి కార్పొరేషన్‌ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్థులు ప్రశ్నించారు. 19 గ్రామాల కార్పొరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. అసైన్డ్‌ రైతులకు కౌలు డబ్బులు చెల్లింపుతో పాటు ఫ్లాట్లు ఇచ్చే అంశంపై త్వరతగతిన నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ ప్రభుత్వం కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని పాలిస్తోంది. అసలు 29గ్రామాలు కలిపితేనే అమరావతి. కానీ ఈ ప్రభుత్వం అమరావతిని విభజించి అమరావతి-1, అమరావతి-2 గా మారుస్తున్నారు. ఒకసారి మూడు రాజధానులు అంటారు... మరోసారి ఉన్న అమరావతిని ఇలా విభజిస్తున్నారు. మాకు19 గ్రామాలతో కూడిన అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్ వద్దు. 29 గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీనే కావాలి. వెంటనే ప్రభుత్వం స్పందించి 29 గ్రామాలతో కూడిన ఏసీసీఎంసీనే ప్రతిపాదించాలి. లేదంటే మా పోరాటం ఉద్ధృతం చేస్తాం. -లింగాయపాలెం గ్రామస్థులు

2020లోనే అమరావతి క్యాపిటల్‌ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అయితే అప్పుడు రాజధానిలో ఉన్న ఉద్యమ తీవ్రత దృష్ట్యా గ్రామసభలు నిర్వహించలేదని అధికారులు తెలిపారు. ఆ తర్వాత మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఏర్పాటు కోసం గ్రామ సభలు నిర్వహించారని.. అప్పుడు రాజధాని పరిధిలోకి వచ్చే 6 గ్రామాల ప్రజలు కూడా తమ సమ్మతి తెలియజేశారని చెప్పారు. ఆ ఆరు గ్రామాలు వేరే కార్పొరేషన్‌లో ఉన్నందున మిగతా 19 పంచాయతీలతో ఇప్పుడు అమరావతి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అధికారుల వివరణతో రైతులు ఏకీభవించలేదు.

ఇదీ చదవండి:

Employees JAC: మరోసారి ఉద్యమబాట పట్టనున్న ఉద్యోగులు.. ఈనెల 9వరకు ప్రభుత్వానికి గడువు

Last Updated : Jan 6, 2022, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details