మాజీ సభాపతి, దివంగత కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోడెల ప్రథమ వర్థంతి కార్యక్రమాలకు తెదేపా నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమెల్యే శ్రావణ్ కుమార్లు హాజరయ్యారు. కోడెల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోడెల తనయుడు శివరాంతో కలిసి ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని తెదేపా నేతలు సందర్శించారు. కోడెల శివప్రసాదరావు హయాంలో ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను తెదేపా నేతలు గుర్తు చేసుకున్నారు.
నరసరావుపేట నలమూలల త్వరలో కోడెల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు చెప్పారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కోడెల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోడెల సేవలను కొనియాడారు. ఆయన మరణానికి వైకాపా ప్రభుత్వం వేధింపులే కారణం అని ఆరోపించారు. కోడెల వర్ధంతి కార్యక్రమాల్లో తెదేపా నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నరసరావుపేటలో కోడెల ప్రథమ వర్ధంతి...పలు సేవా కార్యక్రమాలు
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా నరసరావుపేటలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెదేపా నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టరుగా, నాయకుడిగా కోడెల చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
kodela