Accidents in Andhra Pradesh: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు చెట్టుకు ఢీకొన్న ప్రమాదం ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గిద్దలూరు నుంచి ఒంగోలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన ముగ్గురు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు యూసుఫ్లుగా గుర్తించారు. వీరంతా.. మెడికల్ రిప్రజెంటేటివ్స్ పని చేస్తున్నట్లు తెలిసింది.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామ సమీపంలో వంశధార కాలువలో స్నానానికి దిగి ముగ్గురు మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం వీరు స్నానానికి దిగి గల్లంతు అయ్యారు. నిమ్మాడ ఎస్సీ కాలనీకి చెందిన నాగరాజు (35), అతని కుమారుడు తులసిరాజు(9), మన్యం జిల్లా కు చెందిన వెంకటరమణ (39) మృతదేహాలను అర్ధరాత్రి దాటాక అగ్నిమాపక సిబ్బంది వెలికి తీశారు. నాగరాజు, వెంకటరమణ విజయనగరం జిల్లా రాజాం లోని జూట్ మిల్లు లో కార్మికులుగా పనిచేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం శేషమాంబ పురం చెక్ పోస్ట్ వద్ద విద్యుత్ షాక్ తో ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. విద్యుత్ మరమ్మతుల కోసం కాంట్రాక్టు కార్మికుడు గంగయ్య(33) విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో విద్యుత్ ప్రసరిస్తుండటంతో గంగయ్య స్తంభం ఫై నుంచి కింద పడిపోయాడు. గంగయ్యను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. చికిత్స తీసుకుంటూ గంగయ్య మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే గంగయ్య మృతి చెందినట్లు కుటుంబసభ్యలు ఆరోపించారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.