గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలో భూ కబ్జా కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఇన్నర్ రింగురోడ్డు సమీపంలోని అగతవరప్పాడు పరిధిలో 1.2 ఎకరాల భూమికి సంబంధించి కొందరు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ భూమిని వేరే వాళ్లకు రూ.10 కోట్లకు విక్రయించారు.
అసలు భూ యజమాని వారసులు పోలీసులను ఆశ్రయించారు. తమ భూమిని కొందరు తప్పుడు పత్రాలతో స్వాధీనం చేసుకుంటున్నారని.. భూమిలోకి తమను వెళ్లనీయడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఏడుగురిని బాధ్యులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు అనంతరం సెక్షన్ 467, 468, 420, 506, 509, 323 కింద కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారిలో చంపారపు రాధిక, నిమ్మల గోపినాధ్, బడుగు శ్రీనివాసరావు, యామినేని అమ్మయ్య, అమ్మిశెట్టి శ్రీనివాస్, బొలమాల శ్రీను, గుడివాడ వెంకటగోపాలకృష్ణ ఉన్నారు.