మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ ఏడాది మార్చిలో తాత్కాలిక భవనంలో ఔట్ పేషెంట్ విభాగం ప్రారంభమవగా... ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 12 విభాగాల్లో రోజుకు సుమారు 300 మంది వైద్యసేవలు పొందుతున్నారు. నేటి నుంచి నూతన భవనంలో ఆధునిక సౌకర్యాలతో వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. 5 అంతస్తుల్లో ఉండనున్న ఈ నూతన భవనం ద్వారా... మరింత విస్తృత సేవలందించేందుకు వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
"12 క్లినికల్, 4 డయాగ్నస్టిక్స్ విభాగాలు కలుపుకొని ఈ నూతన భవనంలో మొత్తం 16 విభాగాల్లో సేవలందిస్తాం. ఈ భవనం విశాలంగా ఉంటుంది. అందువల్ల సేవలను మరింత విస్తృతం చేస్తాం. అల్ట్రా సోనోగ్రఫీ, కలర్ డోప్లర్ వంటి సేవలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మెరుగైన ఈ తరహా వైద్యసేవలన్నీ తక్కువ ధరకే అందిస్తాం."
- రాకేష్ కక్కర్, ఎయిమ్స్ సూపరింటెండెంట్
ఈఎన్టీ సహా అన్ని విభాగాల్లో అత్యాధునిక పరికరాలతోనే వైద్యసేవలు అందిస్తున్నామని ఎయిమ్స్ సిబ్బంది చెబుతున్నారు. వైద్యసేవలతో పాటు ఎయిమ్స్ ఆవరణలో ఉన్న అమృత్ కేంద్రం ద్వారా రాయితీపై రోగులకు మందులు అందిస్తున్నారు.