Rythu Bharosa Center: ఆర్‌బీకేల్లో అన్ని ఎరువులూ దొరకవు. విత్తనాలు, పురుగు మందుల తదితరాలకు డబ్బు చెల్లించి బుక్ చేసుకోవాలి. అందుకే నామమాత్ర అమ్మకాలే సాగుతున్నాయి. 2021-22లో రాష్ట్రవ్యాప్తంగా 678కోట్ల 38లక్షల విలువైన 6లక్షల 27వేల టన్నుల ఎరువులు విక్రయించారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కోసం స్థానిక రైతు భరోసా కేంద్రానికి వెళ్లగా.. యూరియా తప్ప ఎలాంటి ఎరువులు లేవని తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని రైతులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటైన నాటి నుంచి అంటే 2020 ఖరీఫ్ నుంచి 2022 ఏప్రిల్ వరకు చూస్తే 1.36 లక్షల లీటర్ల పురుగు మందులు విక్రయించారు. రైతులు ఏదైనా పురుగు మందు అవసరమై ఆర్‌బీకేకు వెళ్తే డబ్బు చెల్లించి బుక్ చేసుకుంటే తెప్పించి ఇస్తామంటున్నారు. అదెప్పటికి వస్తుందో తెలియదు. ఫలితంగా పురుగుమందుల అమ్మకాలు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలోని 10వేల 778 రైతు భరోసా కేంద్రాల్లో 2021-22లో సగటున..700 బస్తాలలోపే ఎరువులు అమ్మారు. 2020-21, 21-22లో సగటున 12.62 లీటర్ల పురుగుమందులు విత్తనాలు, సగటున 13.60 కిలోల విత్తనాలు మాత్రమే విక్రయించారు.
రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. మొత్తం 10వేల,778 రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు సేవలందించాలి. అయితే 1,600 పైగా ఉద్యాన సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ కారణాలతో రాజీనామా చేసిన వారు, సెలవు పెట్టిన వారిని కూడా కలిపితే 4,500 వరకు ఆర్‌బీకేల్లో ఇన్‌ఛార్జుల సేవలే అందుతున్నాయని చెబుతున్నారు. కొందరు రెండు మూడు ఆర్‌బీకే ల పరిధిలో సేవలందించాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలో 64 మంది వ్యవసాయ సహాయకుల పోస్టులుండగా.. ప్రస్తుతం 25 మంది మాత్రమే ఉన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో ఐదింటిలో ఒక కేంద్రానికే మాత్రమే వ్యవసాయ సహాయకులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 500 పైగా పశుసంవర్ధకశాఖ సహాయకుల పోస్టులు ఖాళీగా ఉండటంతో.. గోపాలమిత్రలకు విధులు అప్పగించారు.