TDP senior leader Dhulipalla Narendra : తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన ఉంటున్న ఇల్లు తప్ప ప్రభుత్వానికి ప్రజా సమస్యలేవీ పట్టవా అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉండే ఇల్లు చంద్రబాబుదనీ.. ఉండవల్లిలో అద్దెకుంటున్నారని తాము ధైర్యంగా చెప్పగలమని అన్నారు. ఉండవల్లిలో ఉంటోంది అద్దె ఇల్లు కాబట్టే చంద్రబాబు దానికి అద్దె కూడా చెల్లిస్తున్నారని నరేంద్ర తెలిపారు.
ప్రభుత్వంపై ధూళిపాళ్ల ధ్వజం బెంగుళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డి పేరు మీద లేదా భారతీ రెడ్డి పేరు మీద ఉన్నాయా అని నిలదీశారు. అవి ఎవరి పేరు మీద ఉన్నాయో చెప్పగలరా అని నరేంద్ర ప్రశ్నించారు. క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన ప్యాలెస్‌లు కాబట్టే సమాధానం చెప్పలేకపోతున్నారని ఆరోపించారు.
సజ్జల నటన అపూర్వం.. క్యాంప్ క్లర్క్ సజ్జల రామకృష్ణారెడ్డి నటన ఎస్వీ రంగారావుని మించిపోయిందని ధూళిపాళ్ల దుయ్యబట్టారు. అధికారం తమ చేతిలో పెట్టుకుని, ప్రభుత్వ నివాసమా లేక ప్రైవేటు నివాసమా అని అడగటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కాగితాల మీద ప్రతిపాదనలకే పరిమితమైన ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్‌పై తెలుగుదేశం ప్రభుత్వం అభ్యంతరాలు కోరితే, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి నిద్రపోయారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అభ్యంతరం కూడా ఆళ్ల నుంచి ఎందుకు రాలేదని నిలదీశారు. ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ హోదా కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఉంటున్న ఇంటిని తన అధికారిక నివాసంగా గుర్తించమని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా గుర్తించలేదని ధ్వజమెత్తారు.
టీడీపీ కల్పించిన గౌరవాన్ని మరిచారా..? జగన్ ప్రతిపక్ష నేతగా స్టేట్ గెస్ట్ హౌస్‌ను సకల సౌకర్యాలతో టీడీపీ ప్రభుత్వం కల్పించిన గౌరవం మరిచారా అని ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు ని ఏదో రకంగా రోడ్డు మీదకు నెట్టాలనే కుట్రలో భాగమే అటాచ్మెంట్ డ్రామా అని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు ప్రజల కోసం బస్సులోనే గడిపిన సందర్భాలు అనేకమని గుర్తు చేశారు. విలాసవంతమైన భవనాలు, సౌకర్యవంతమైన ప్రయాణాలు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్లు... చంద్రబాబు ఎన్నడూ కోరుకోలేదని తెలిపారు. సీఐడీ కూడా జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలా పని చేయటం దుర్మార్గమని దుయ్యబట్టారు. సీఐడీని ఇంత విచ్చలవిడిగా గతంలో ఏ ప్రభుత్వమూ వాడలేదని విమర్శించారు. జీవో1ను హైకోర్టు కొట్టివేయటంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇంటి అంశాన్ని తెరపైకి తెచ్చారని ధూళిపాళ్ల మండిపడ్డారు.
ఇవీ చదవండి: