Senior IPS Officer AB Leave Petition:ఆర్జిత సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను సాంకేతిక కారణాలు చూపుతూ హైకోర్టు తోసిపుచ్చింది. అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అనుబంధ పిటిషన్లో కోరకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మాత్రమే కోరారని గుర్తు చేసింది. సీఎస్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తేనే తదనంతర పర్యావసానంగా విదేశాలకు అనుమతిచ్చే వ్యవహారం ఉత్పన్నమవుతుందని తెలిపింది. అనుబంధ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు, విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది శరత్ చంద్ర వెంటనే స్పందిస్తూ.. తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లో చోటుచేసుకున్న సాంకేతిక పొరపాటు కారణంగా పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం పడుతోందన్నారు. లోపాన్ని సరిదిద్దుకొని వెంటనే అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తానని మధ్యాహ్నం విచారణ చేయాలని కోరారు. అందుకు అనుమతిచ్చిన హైకోర్టు.. మధ్యాహ్నం విచారణ జరిపి బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జడ్జ్ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆదేశాలిచ్చారు.
ఆర్జిత సెలవులపై 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని చేసిన అభ్యర్థనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వాదనలు పూర్తి కావడంతో మంగళవారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. సాంకేతిక కారణాలు చూపుతూ మంగళవారం అనుబంధ పిటిషన్ను తోసిపుచ్చారు. మరోవైపు అనుమతి నిరాకరిస్తూ సీఎస్ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసి తనను విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషనర్ తాజాగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని తెలిపారు.