అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గురువారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు రోడ్డులో జొన్నలగడ్డ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. సిమెంట్ లారీలో తరలిస్తున్న మద్యాన్ని.. మరో 3 కార్లలోకి మారుస్తుండగా గుర్తించారు.
వారిని అడ్డుకున్న పోలీసులు.. 100 కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ సుమారు రూ. 8 లక్షల 41 వేలు ఉంటుందని తెలిపారు. మూడు కార్లను సీజ్ చేసి, పది మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని నరసరావుపేట ఎస్సై పేర్కొన్నారు.