ఖరీఫ్ సీజన్ త్వరలో మొదలవబోతోంది. పత్తి, మిరప, కూరగాయలు, అపరాల పంటల సాగుకు అవసరమయ్యే విత్తనాల సేకరణ మొదలైంది. రైతులు ఇప్పటికే కూరగాయల విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ కారణంగా ఎక్కడా దుకాణాలు తెరవలేని పరిస్థితి. ముఖ్యంగా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లా కేంద్రాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లుగా మారటంతో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలవుతోంది.
గుంటూరు, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, కడప, అనంతపురం వంటి నగరాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అలాంటి చోట్ల విత్తనాలు, ఎరువులు దొరకడంలేదు. జిల్లాలోని గుంటూరు నగరంతోపాటు మంగళగిరి, నర్సరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, దాచేపల్లి, కారంపూడి, పిడుగురాళ్ళ పట్టణాల్లో లాక్ డౌన్ కారణంగా విత్తనాల దుకాణాలను పోలీసులు తెరవనీయటంలేదు. ఖరీఫ్ సీజన్ మొదలు కానుండటంతో కంపెనీల నుంచి విత్తనాలు దుకాణాలకు చేరుతున్నాయి. అయితే అధికారుల ఆంక్షల కారణంగా వాటిని తెరవటంలో అడ్డంకులు ఏర్పడ్డాయని వ్యాపారులు చెబుతున్నారు.
దుకాణాలన్నీ చాలాకాలం నుంచి పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామాల్లో ఎరువుల దుకాణాలు కొంతమేరకు ఉన్నప్పటికీ.. మెజారిటీ పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అధికారుల ఆంక్షలు కొనసాగితే విత్తనాల అమ్మకాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని.. రైతులకు విత్తనం దొరకని పరిస్థితి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
మొదటి విడత లాక్ డౌన్ ముగిసిన తర్వాత కేంద్రం వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువుల రవాణాకు అనుమతిచ్చింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ రెడ్ జోన్లలో ఆంక్షల కారణంగా ఆ మినహాయింపులు వర్తించడంలేదు. ఖరీప్ కోసం పలు రకాల విత్తనాలు కంపెనీల నుంచి గోదాములకు, టోకు వ్యాపారుల నిల్వ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే చేరుతున్నాయి. అయితే రెడ్ జోన్ ప్రాంతంలో అధికారులు విత్తన రవాణా, నిల్వకు ఒప్పుకోవటంలేదు.