Cantonment MLA Sayanna passed away: తెలంగాణలోని సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న(72) కన్నుముశారు. గత కొంతకాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే సాయన్న ఈనెల 16న గుండెనొప్పితో యశోద ఆస్పత్రిలో చేరారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాయన్న భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా:ఎమ్మెల్యే జి.సాయన్న బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చేశారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు. సాయన్న కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 1999, 2004, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. సాయన్న హుడా డైరెక్టర్‌గా ఆరుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో తితిదే పాలకమండలి సభ్యుడిగా కొనసాగారు. వీధిబాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ ఛైర్మన్‌గా చేసిన విధులు నిర్వర్తించారు.
సీఎం కేసీఆర్ సంతాపం: ఎమ్మెల్యే సాయన్న మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అరుదైన ఘనత సాధించారని సీఎం వెల్లడించారు. వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయం అని కేసీఆర్ అన్నారు. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు.
కిషన్‌రెడ్డి సంతాపం:ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.