పథకాలు వర్తింపజేయటంలో వివక్ష, అవినీతి ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సాయాన్ని సీఎం విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆటో, టాక్సీ డ్రైవర్లు, రవాణా అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం... వారికి పథకం లక్ష్యాలను వివరించారు. 2,62,493 మంది ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది అదనంగా 37,754 మందికి సాయం చేస్తున్నామని వెల్లడించారు. పాత అప్పులకు ఈ డబ్బు జమ చేసుకోలేని విధంగా చేస్తున్నామని సీఎం చెప్పారు.
లబ్ధిదారుల్లో ఎవరికైనా నగదు రాకపోతే కంగారు పడవద్దని సీఎం జగన్ సూచించారు. గ్రామ సచివాలయం, స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వచ్చే నెల 4న మిగిలిన వారందరికీ ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు బీమా, ఫిట్నెస్ ధ్రువ పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని సీఎం సూచించారు.
ఆటో టాక్సీలు మంచి కండిషన్లో పెట్టుకోవాలని కోరారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఎం అన్నారు.