ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ నామినేషన్ల సందడి - ఏపీ పంచాయతీ ఎన్నికలు వార్తలు

రాష్ట్రంలో రెండో దఫా పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు ఊపందుకుంది. ట్రాక్టర్లు, వాహనాలపై ర్యాలీగా వెళ్లిన అభ్యర్థులు సందడిగా నామినేషన్ వేశారు. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ల నామపత్రాల అందజేతతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. కొన్నిచోట్ల సమస్యలు సృష్టిస్తున్నారంటూ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు.

second phase nominations in the state
రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ నామినేషన్ల సందడి

By

Published : Feb 3, 2021, 8:53 PM IST

జోరందుకున్న నామినేషన్లు

పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా... రెండో దశ నామినేషన్ల పర్వం జోరందుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురంలో సర్పంచ్ అభ్యర్థి మోహన్‌రావు.... 15ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా చేరుకుని నామపత్రాలు సమర్పించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ సందడిగా సాగింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో నామపత్రాల సమర్పణ జోరందుకుంది. అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌లో అభ్యర్థులు ఉత్సాహంగా నామపత్రాలు సమర్పించారు. బండూరు గ్రామ పంచాయతీ అభ్యర్థిగా దంత వైద్యురాలు రాధిక నామినేషన్ వేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ నామినేషన్ల సందడి

అధికారపక్షం బెదిరింపులకు పాల్పడుతోంది..

గుంటూరు జిల్లాలో రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో రెండోరోజు నామినేషన్లు ఊపందుకున్నాయి. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో అధికసంఖ్యంలో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ఎన్నికల వేళ అధికారపక్షం బెదిరింపులకు పాల్పడుతోందంటూ గుంటూరులో భాజపా మద్దతుదారులు అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్నంగిలో తాము మద్దతునిచ్చిన అభ్యర్థి తేదీ వేయని కారణంగా నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు.

పోటాపోటీ..

పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాల్లో రాజకీయం రసకందాయంగా మారింది. అధికార పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో వైకాపా ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏఎం​సీ ఛైర్మన్ చిట్టూరి సునంద తమ తమ వర్గీయులతో కలిసి నామినేషన్లు దాఖలు చేయించారు. ఇళ్లస్థలాల్లో అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే కారుమూరిపై తణుకు పురపాలక మాజీ ఛైర్మన్ బలగం సేతుబంధన సీతారాం, బీసీ నేత కడియాల సూర్యనారాయణ అధిష్టానానికి గతంలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వీరంతా సునంద వర్గానికి మద్దతుగా నిలిచి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనటంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

మమ్మల్నే గెలిపించాలి..

పంచాయతీ ఎన్నికల పోరులో అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పశ్చిమగోదావరికి చెందిన అభ్యర్థులు నేటి కాలంలో సామాజిక మధ్యమాలకు ఉన్న ఆదరణను అవకాశంగా తీసుకుని వాటినే ప్రచార వేదికలుగా మలుచుకుంటున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్‌ల వేదికగా ప్రచారం చేస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాజావెస్ట్ గ్రామంలో భాస్కరరావు అనే అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. గుర్రంపై తిరుగుతూ ఇంటింటికీ శీతలపానీయాలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:అక్కడ 40 ఏళ్లుగా ఎన్నికలు లేవు..!

ABOUT THE AUTHOR

...view details