కాదేదీ వ్యర్థం.. ఉపయోగిస్తేనే ఉంటుంది అర్థం. ఆలోచనకు రూపం రావాలే గానీ, వ్యర్థాలైనా కళాఖండాలుగా మారుతాయి. ఇదే రీతిలో...అద్భుతమైన శిల్పాలు ఆవిష్కరిస్తున్నారు ఈ కళాకారులు.! వీరి సృజనాత్మకతతో వ్యర్థాలు ఆకట్టుకునే కళారూపాలయ్యాయి. వృథా వస్తువులే షోకేజీ బొమ్మలయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు కుటుంబం విగ్రహాల తయారీలో సిద్ధహస్తులు. వారసత్వంగా వస్తున్న ఈ కళను వెంకటేశ్వరరావు... సూర్య శిల్పశాల ఏర్పాటు చేసి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన తనయుడు రవిచంద్ర..మరింత వినూత్నంగా ఆలోచించి ఇనుప తుక్కుతో చక్కటి శిల్పాలు రూపొందిస్తున్నాడు. ఈ కళపై చైనాలో శిక్షణ పొందిన రవిచంద్ర..భారీ పరిమాణంలో శిల్పాలు తయారు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.
కాటూరి కుటుంబం తయారు చేసిన విగ్రహాలు...వివిధ నగరాల్లో పార్కులు, కూడళ్లు సహా స్టార్ హోటళ్లు, ఐటీ కంపెనీల్లో కొలువుదీరాయి. ఇక్కడ కనిపిస్తున్న అందమైన భారీ బొమ్మలతో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలూ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కళాఖండాలను చూసిన ఓ సింగపూర్ సంస్థ వీరిని సంప్రదించింది. ఆ సంస్థ సహకారంతో అక్కడా ప్రదర్శనలు ఇచ్చారు.