హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం Disruption of Schools in Name Of Rationalise of Schools in Andhra Pradesh: విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ప్రతిసారి చెప్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలోనిప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పే ముఖ్యమంత్రి.. పాఠశాలల్లో కనీసం సబ్జెక్టు టీచర్లు కూడా నియమించటం లేదు. హేతుబద్ధీకరణఅనే పేరుతో తరగతులలోని సెక్షన్లలో విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న తరగతులకు ఎస్జీటీలను కేటాయిస్తూ విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో వందల ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఎస్జీటీలనే కేటాయించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తికావడంతో పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు విద్యార్థులకు గణితం, సామాన్యశాస్త్రం లాంటి కీలక సబ్జెక్టులనూ ఎస్జీటీలే బోధించాల్సిన దుర్భర స్థితి నెలకొంది. ఎస్జీటీల కొరతతో కొన్ని బడులకు సక్రమంగా కేటాయించలేదు. 6,7,8 తరగతుల్లో గణితం, సామాన్యశాస్త్రాలను ఎస్జీటీలతో చెప్పిస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటన్న విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.వారు ప్రపంచంతో ఎలా పోటీపడగలరో అర్థంకాని పరిస్థితి. 3తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించేందుకు.. 6 వేల 267 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. దీంతో కొన్నిచోట్ల ఎస్జీటీల కొరత ఏర్పడింది.
ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 8 తరగతుల్లో 98 మంది విద్యార్థుల కంటే తక్కువ విద్యార్థులుంటే ఎస్జీటీలనే కేటాయించారు. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 30మందికి ఒకరి చొప్పున ఎస్జీటీలను కేటాయించారు. ఆరవ తరగతి నుంచి ఎనిమిదోవ తరగతి వరకు 53 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటేనే అదనపు సెక్షన్ ఏర్పాటు చేశారు. 9,10 తరగతుల్లో 60 మంది వరకు ఒకే సెక్షన్ పెట్టడంతో.... ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటన సైతం డొల్లేనని తేలిపోయింది.
తెలుగు, హిందీ టీచర్లు, పీడీలు బదిలీ అయినా రిలీవ్ కాలేని పరిస్థితి నెలకొంది. న్యాయవివాదాలతో తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు భర్తీకాలేదు. సాధారణ బదిలీలు పొందిన కొందరి స్థానాల్లోకి కొత్తవారు రాకపోవడంతో రిలీవ్ కాలేకపోతున్నారు. డీఎస్సీ-98కు చెందిన 4,072 మందిని ఏప్రిల్ 12న తీసుకోగా.. వీరిలో 16 మంది నెల చివరికే పదవీవిరమణ చెందారు. మే నెలలో 256 మంది పదవీవిరమణ పొందారు. ఈ నెల చివరినాటికి 400 మంది పదవీవిరమణ చేయబోతున్నారు. ఈ లెక్కన అప్పుడే 672 మంది పదవీవిరమణ పొందారు. మరోవైపు వేసవి సెలవుల ముందు కాంట్రాక్టు సర్వీసు పూర్తయింది. ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకపోవడంతో వీరి పరిస్థితి సందిగ్ధంలో ఉంది.
పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు అందిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినా.. పాఠశాలలకు పూర్తిస్థాయిలో అన్ని వస్తువులూ చేరలేదు. కొన్ని జిల్లాల్లో బూట్లు, నోటుపుస్తకాలు, బ్యాగ్‌లు పూర్తిగా రాలేదు.