SC and BC Constituencies are Under Jagan Community:జగన్ ఇటీవల 11 నియోజకవర్గాల్లో తన పార్టీ సమన్వయకర్తలను మారిస్తే అందులో అయిదుగురు దళితులు, ముగ్గురు బీసీలున్నారు. వీళ్లే కాదు రాష్ట్రంలోని మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పునకు వైఎస్సార్సీపీ నాయకత్వం రంగం సిద్ధం చేసింది. బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాల్లో నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా వారి కంటూ ఒక నియోజకవర్గం స్థిరంగా ఉండకుండా వైఎస్సార్సీపీ అధిష్ఠానం పార్టీ సమన్వయకర్తలను మార్చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి దాదాపు వైఎస్సార్సీపీ నాయకులు గెలిచిన ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలన్నీ ఇప్పటికే అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న మార్పులూ వారిపై పెత్తనం చెలాయించేందుకేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నా ఎస్సీలు అంటూనే వారికి నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం. కానీ 2014లో సంతనూతలపాడు నుంచి, 2019లో యర్రగొండపాలెం నుంచి ఆయన్ని వైఎస్సార్సీపీ బరిలో దించింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన సొంత నియోజకవర్గంలో నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంది. కానీ సురేష్‌ను తాజాగా కొండపికి మార్చారు. ఆపై జిల్లా దాటించేస్తారేమోనని సురేష్ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. 2019లో సంతనూతలపాడు నుంచి గెలిచిన టీజేఆర్ సుధాకర్‌బాబు సొంత జిల్లా గుంటూరు కాగా ఆయన్ని ప్రస్తుతం పూర్తిగా పక్కన పెట్టేశారు. వీరిద్దరినీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే వ్యతిరేకిస్తున్నారు.
వైసీపీలో చిచ్చు రేపిన ఇంఛార్జ్‌ల నియామకం - కొనసాగుతున్న రాజీనామాల పరంపర
Jagan community ruling in SC constituencies..
- ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీల చేతుల్లో ఉండటం లేదు. అగ్రవర్ణాల నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. రాయలసీమలో అయితే ఇక సీఎం సామాజికవర్గ నాయకులదే హవా. వారు చెప్పినవారికే సీటు. గెలిస్తే పెత్తందార్లు చెప్పినట్లుగా నడుచుకోవాలి.
- ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన బద్వేలులో డీసీ గోవిందరెడ్డి, నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, కోడుమూరులో కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, శింగనమలలో ప్రస్తుత ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి పెత్తనం సాగుతోంది.
- సత్యవేడు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదుపులో ఉన్నాయి.
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, సంతనూతలపాడు, కొండపి నియోజవర్గాల్లో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పిందే వేదం అన్నట్లు పరిస్థితి ఉంది.
- ఉత్తరాంధ్రలో ఎస్సీ నియోజకవర్గం అయిన రాజాం, ఎస్టీ నియోజకవర్గం అయిన పాలకొండలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ అయిన పాలవలస విక్రాంత్ చేతిలో ఉన్నాయి.
- గూడూరు నియోజకవర్గంలో పెత్తందార్లదే రాజ్యంగా మారిపోయింది. ఈ నియోజకవర్గంపై పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కుమారస్వామి రెడ్డి, శివకుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ఆధిపత్యమే ఉంటోంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌ను ఈ సారి అక్కడ కొనసాగించే అవకాశం లేదంటున్నారు.