ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారసుల భుజాన గెలుపు బాధ్యతలు

తండ్రి విజయం కోసం పిల్లల ప్రచారం... ఒకరు పట్టణ ఓటర్లపై దృష్టి పెడితే... మరొకరు గ్రామాల బాట పట్టారు. గెలుపు వ్యూహాలు రచిస్తూ రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న ఆ వారసుల సంగతేంటో ఈ స్టోరీలో చూడండి.!

సత్తెనపల్లిలో వారసుల ప్రచారం

By

Published : Apr 1, 2019, 5:50 PM IST

సత్తెనపల్లిలో వారసుల ప్రచారం
ఎన్నికలు వస్తే చాలు పార్టీల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చూస్తుంటాం. ఆసక్తికరమైన ఫీట్లు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నమంటూ ఉండదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాత్రం వారసులు రంగంలోకి దిగారు. తండ్రుల గెలుపు బాధ్యత భుజాలపై మోస్తున్నారు పార్టీ జెండాలా. తెదేపా అభ్యర్థి కోడెల తరపున ఆయన కుమారుడు...ఇద్దరు కుమార్తెలు రంగప్రవేశం చేస్తే.. వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు తరపున ఇద్దరు కుమార్తెలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

కుమారుడు, కుమార్తెలు
సత్తెనపల్లి అసెంబ్లీ స్థానానికి తెదేపా తరపున కోడెల... వైకాపా తరపున అంబటి రెండోసారి పోటీ పడుతున్నారు. పోలింగ్‌కు తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థులతో కుటుంబ సభ్యలూ ప్రచారంలోకి దిగారు. కోడెల తరపున ఆయన కుమారుడు డాక్టర్ కోడెల శివరాం, కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి ఇద్దరూ ప్రచారం సాగిస్తున్నారు. తండ్రి పట్టణంలో ప్రచారం చేస్తుంటే...అన్నా చెల్లెలు గ్రామ ఓటర్లతో మమేకమవుతున్నారు.

ప్రచారంలో అక్క , చెల్లి
వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు తరపున ఆయన కుమార్తెలు మౌనిక, శ్రీజ ప్రచారం చేస్తున్నారు. కిందటిసారి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన తండ్రిని ఈసారి గెలిపించుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
సత్తెనపల్లిలో తెదేపా, వైకాపాలకు గెలుపు ప్రతిష్ఠాత్మకమే. కిందటిసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరులో స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన అంబటి ఈసారి మాత్రం సత్తెనపల్లిలో సత్తా చాటాలానుకుంటున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో భారీ మెజార్టీ కొట్టాలని కోడెల చూస్తున్నారు.

తండ్రుల విజయభారాన్ని భుజాన వేసుకున్న వారసుల శ్రమ ఎలాంటి ఫలితం ఇస్తుందోమే 23న తేలనుంది.

ABOUT THE AUTHOR

...view details