ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటు విజయం...ఇటు అధికారం వయా సత్తెనపల్లి

అక్కడ గెలిస్తే రాష్ట్రంలో  గెలిచినట్లే...అక్కడ ఓడితే అధికారం చిక్కనట్లే. అక్కడ పార్టీ అభ్యర్థి గెలిచినా..బలపరచిన వ్యక్తి గెలిచినా  రాష్ట్రంలో ఆ పార్టీదే పవర్.  గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి తెదేపా సెంటిమెంట్ ఇది... ఇదేదో మాటవరుసకు చెప్పింది కాదు. తెదేపా ఆవిర్భావం నుంచి అధికారంలో ఉన్న ప్రతీసారి  సత్తెనపల్లిలో ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు మరి..! ఈ సారి ఓటరు తీర్పు ఏ తీరుగా ఉండనుందో..!?

సత్తెనపల్లి సెంటిమెంట్ నిజమేనా..?

By

Published : Mar 30, 2019, 7:02 AM IST

అటు విజయం...ఇటు అధికారం వయా సత్తెనపల్లి
ఎన్నికలు వస్తే చాలు ప్రతి పార్టీ.....సమీకరణాలు.. బలబలాలు..గెలిచే అభ్యర్థులు.. ఇలా రకరకాల లెక్కలేసుకుంటాయి. అందులో సెంటిమెంట్​లకు అవకాశం లేకపోలేదు. అలాంటి సెంటిమెంటే వెంటాడుతోంది తెలుగుదేశం పార్టీని. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సైకిల్ సత్తా చాటితే..రాష్ట్రంలోనూ సైకిల్ సవారీ చేస్తోందనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. సత్తెనపల్లి లెక్క మరోసారి నిజమయ్యేనా..? లేక ఫలితాల లెక్క తప్పుతుందా...అన్న అంశం గుంటూరు రాజకీయంలో ఘాటుగా మారుతోంది.ఆ పార్టీలోఆసక్తి ఎక్కువే...
సతైనపల్లి...ఎలాగైనా ఆ నియోజకవర్గాన్ని ఖాతాలో వేసుకోవాల్సిందే అన్న భావన రాజకీయ పార్టీలది. ఇక్కడి గెలుపును ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త ముందంజలోనే ఉంటుంది. 1983 నుంచి 2014 ఎన్నికల వరకు తెదేపా లేదా...పొత్తులో భాగంగా బలపర్చిన అభ్యర్థి అయినా సరే అక్కడ విజయం సాధిస్తే....అధికారంలోకి రావటం సాధారణం అయిపోయింది.
1983 నుంచి విజయయాత్ర..
సత్తెనపల్లి ఎన్నికల గణాంకాలు చూస్తే....1983లో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్నపనేని రాజకుమారి పోటీ చేసి గెలుపొందారు. 1985 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ.. పొత్తులో భాగంగా ఈ సీటును సీపీఎంకు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి పి.వెంకటపతి విజయం సాధించారు. ఈ రెండుసార్లు ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించింది. 1989లో సీపీఎం అభ్యర్ధిగా మళ్లీ పోటీ చేసిన వెంకటపతి ఓడిపోగా... రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.
2004, 2009లో హస్తం గాలి...
1994లో పొత్తులో భాగంగా తెదేపా.... ఈ సీటును వామపక్ష అభ్యర్థి, వెంకటపతి భార్య భారతికి ఇవ్వగా.. ఈ ఎన్నికల్లో భారతి విజయం సాధించారు.మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైవీ ఆంజనేయులు గెలుపొందగా.... రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంది తెదేపా. 2004, 2009 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి గెలవగా... ఈ రెండుసార్లు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైంది.
అక్కడ కోడెల...ఇక్కడ చంద్రబాబు..
రాష్ట్ర విభజన అనంతరం...2014లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు విజయం సాధించగా...రాష్ట్రంలో సైకిల్ పార్టీ స్పీడ్ తో పరిగెత్తి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సత్తెనపల్లిలో అభ్యర్థి విజయం సాధించినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా ? అంటే అది ఊహాతీతమే అవుతుంది. అయితే ఇంతకుముందు వచ్చిన ఫలితాలు ఈ సెంటిమెంట్​ను బలపరుస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు రెండో సారి బరిలోకి దిగుతుండగా.... ప్రతిపక్షవైకాపా తరపున అంబటి రాంబాబు రెండోసారిపోటీ చేస్తున్నారు. మరీ సత్తెనపల్లి సెంటిమెంట్ ను ఈసారి ఫలితాలు నిజం చేస్తాయో లేదో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details