Problems of Sarpanchs in Andhra Pradesh: ఊరికేదో ఉపకారం చేద్దామని చివరకు ఏమీ చేయలేక రోడ్డుపక్కన పండ్లు అమ్ముకుంటున్నారు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు సర్పంచ్ ఆరమళ్ల విజయ్‌కుమార్. ఈయనొక్కరేకాదు.. రెండేళ్ల క్రితం.. ఎన్నో ఆశలు, లక్ష్యాలతో ఎన్నికైన గ్రామ పెద్దలందరిదీ.. ఇదే పరిస్థితి. ప్రభుత్వం దెబ్బకు పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయి.
ముందెన్నడూ లేని విధంగా పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులనూ.. ప్రభుత్వం లాగేసుకుంది. 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు రూ.1,245 కోట్లను మళ్లించింది. దీనికి.. పంచాయతీ పాలకవర్గం తీర్మానం కూడా లేదు, పీడీ ఖాతాల్లో నుంచి.. ఏకపక్షంగా కరెంటు ఛార్జీల కింద సర్దుబాటు చేసింది. ఖాతాలు ఖాళీ అవడంతో.. ఊళ్లో కనీసం కరెంటు లైటు కూడా పెట్టించలేని స్థితిలోకి సర్పంచ్‌లు వెళ్లిపోయారు.
ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం లాగేసుకోవడంతో.. సాధారణ నిధులతో పనులు చేద్దామన్నా.. దానికీ సహకారం లేని పరిస్థితి. ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్) నుంచి.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సరిగా జీతాలూ.. చెల్లించడం లేదు. సర్పంచిలే చెత్త సేకరించి నిరసన తెలుపుతున్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన ఉండడంలేదు.
పథకం ప్రకారం సర్పంచుల అధికారాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కత్తెరవేసింది. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో పంచాయతీలు ఉనికినే ప్రమాదంలో పడేసింది. సచివాలయాలు పని చేస్తోంది పంచాయతీల పరిధిలోనైనా.. అందులోని ఉద్యోగులపై సర్పంచ్‌లకు.. ఎలాంటి అధికారం లేదు. ప్రభుత్వ పథకాల నుంచి పనుల వరకూ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులదే పెత్తనం. ఉద్యోగులకు సాధారణ సెలవు మంజూరు చూసే అధికారాన్నీ తీసేసింది.