Sarpanch sells fruits: గ్రామ పంచాయతీ ఖాతాలో ఉన్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పనులు చేయడానికి నిధులు లేవని, ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన వట్టిచెరుకూరు సర్పంచి ఆరమళ్ల విజయ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి సొమ్ము లేకపోవడంతో పంచాయతీ కార్యాలయానికీ వెళ్లడం లేదని తెలిపారు.
గ్రామస్థులు తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే వారి సమస్యలను తీర్చడానికి రూ.6 లక్షలు అప్పు తెచ్చి వివిధ పనులు చేశానని, ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. గ్రామ పంచాయతీ ఖాతాలో ఉన్న ఆర్థిక సంఘం నిధులు రూ.17లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బిల్లులు కింద జమ చేసుకుందని తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న బకాయిలను ఒకేసారి జమ చేసుకుంటే పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు.