Sankranthi Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఏడాదంతా ఆనందోత్సాహాలు, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ భోగి మంటలతో సరదాల సంక్రాంతికి ప్రజలు స్వాగతం పలికారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులు, కోడి పందాలతో ఊరూవాడా సందడిగా మారాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.
వెల్లివిరిసిన సంక్రాంతి శోభ: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. అనంతపురం జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పోలీసు అధికారులంతా సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి డీఐజీ అమ్మిరెడ్డి చిందేసి అలరించారు. ప్రజలంతా సాంప్రదాయ ఆటపాటలతో ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
సంక్రాంతి సంబరాలు - ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ కోడిపందేలు
అంగరంగ వైభవంగా పండగ సంబరాలు : శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ పార్వతీ సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళాకారులు, భక్తజన సందోహం మధ్య శ్రీగిరి పురవీధుల్లో రావణ వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. కర్నూలులోని వెంకటరమణ కాలనీలో వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు ఆర్యవైశ్యుల పెద్దలు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. యువత సినీగీతాలకు డాన్సులు చేసి అలరించారు.