ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Seasonal diseases: పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. - AP Latest News

Defects in sanitation management: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. సీజనల్ వ్యాధులు ప్రజలపై పడగ విప్పుతాయి. అతిసారం, విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రజారోగ్యంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, శుద్ధ జలాల అందించడంపై ఆయా శాఖలు దృష్టి పెట్టడం లేదు. ఇక గ్రామాల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా తయారైంది. వైఎస్సార్​సీపీ సర్కార్ హయాంలో పంచాయతీలకు నిధుల్లేక పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి మాత్రం ఏం పట్టడం లేదు.

Defects in sanitation management
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం

By

Published : Jul 25, 2023, 11:47 AM IST

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం

Defects in sanitation management: వైఎస్సార్​సీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాలుగేళ్ల నుంచి పారిశుద్ధ్యా‌‌న్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామమే నిదర్శనం. గతేడాది జులై 14న ఈ గ్రామంలో అతిసారం వ్యాపించి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 150 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. మురుగు ప్రవహిస్తున్న చోటనున్న మంచినీటి పైప్‌లైన్‌ లీకవడమే దీనికి కారణం. సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకు అప్పట్లో జిల్లా యంత్రాంగం పర్యవేక్షించినప్పటికీ సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి చూపలేదు. ఫలితంగా ఏడాది తర్వాత కూడా తెంపల్లిలో పల్లపు దారులు, మురుగు కదలని కాలువలు, నీటికుంటల్లో తాగునీటి మోటార్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ఈ వర్షాకాలంలో ఎలాంటి విపత్తులు తలెత్తుతాయోనని గ్రామస్థులు భయపడుతున్నారు. ఒక్క తెంపల్లి మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

ALSO READ:పట్టించుకోని అధికారులు.. పారిశుద్ధ్య కార్మికులుగా మారిన ప్రజలు

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి జులై 16వ తేదీ వరకు నమోదైన కేసులు..

  • డెంగీ.. 2వేల 498
  • మలేరియా.. 2 వేల 1
  • టైఫాయిడ్‌.. 14 వేల 473
  • డయేరియా.. 26 వేల 754

కర్నూలులో.. శుభ్రం చేయని ట్యాంకుల నుంచే మంచినీరు సరఫరా చేస్తున్నారు. కుళాయిల్లో రంగు మారిన నీరు సరఫరా అవుతున్నా అధికారుల్లో చలనం లేదు.

శ్రీ సత్యసాయి జిల్లాలో..పారిశుద్ధ్య నిర్వహణ లోపాలతో దోమల విజృంభణ పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం.. గత అయిదు నెలల్లోనే 95 డెంగీ, 4 మలేరియా కేసులు నమోదయ్యాయి. బాధితుల అసలు సంఖ్య వందల్లోనే ఉంటుంది.

గుంటూరు జిల్లాలో.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 57 డెంగీ కేసులను గుర్తించారు. ఇలా రోగాలకు కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంపై జగన్ సర్కారు దృష్టి పెట్టలేదు.

మంచి నీటి పైపులైన్లలో మురుగు కలిసే పరిస్థితులు..వర్షాకాలం వ్యాధులు, ప్రజారోగ్యంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ, శుద్ధ జలాన్ని అందించడంపై ఆయా శాఖలు కనీసం దృష్టి చూపడం లేదు. అతిసారంతోపాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌లాంటి విషజ్వరాలపై ప్రజా చైతన్య కార్యక్రమాలను వైద్యశాఖ నామమాత్రంగానే చేస్తోంది. ఆసుపత్రులు, వైద్య సిబ్బంది.. ఈ విషయంలో అసలు చొరవ చూపడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా వీధులు మురికి కూపాలవుతున్నాయి. కొన్ని చోట్ల ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. చాలా చోట్ల మంచి నీటి పైపులైన్లలో మురుగు కలిసే పరిస్థితులుఉన్నాయి.

నిధుల్లేక అటకెక్కిన పారిశుద్ధ్య నిర్వహణ.. మంచి నీటి ట్యాంకులు తరుచూ శుభ్రం చేయడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణకు గ్రామపంచాయతీలను నిధుల కొరత వెన్నాడుతోంది. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు, సర్పంచుల అధికారాలను పరిమితం చేయడం పారిశుద్ధ్య సమస్య పెరగడానికి ఒక కారణంగా నిలుస్తోంది. రాష్ట్రంలో సగానికి పైగా మైనర్‌ పంచాయతీలు చిన్నచిన్న పనులు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడతాయి. నిధుల్లేక అవి దిక్కులు చూడాల్సి వస్తోంది.

ALSO READ:ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. పారిశుద్ధ్య కార్మికుల సొమ్ముపై విచారణ జరపమని దిల్లీ నుంచి ఆదేశం

వైద్య శిబిరాలపై శ్రద్ధ లేని వైద్య యంత్రాంగం..ఆశా కార్యకర్తలు, ఏఎన్​ఎంలు చెత్త, మురుగు ఉన్న ఫొటోలను సెల్‌ఫోన్లలో తీసి యాప్‌ ద్వారా పంపిస్తే పంచాయతీ సిబ్బంది శుభ్రపరచాలి. బాగయ్యాక చిత్రాలను తిరిగి యాప్‌లో పెట్టాలి. కానీ సమన్వయ లోపంతో ఈ ప్రక్రియ నామమాత్రంగా మారింది. ఒకే ప్రాంతం నుంచి వస్తున్న రోగులను గుర్తించి ఆ ప్రాంతాల్లో లార్వా నిర్మూలన, వైద్య శిబిరాలను నిర్వహణ వంటి వాటిపై వైద్య యంత్రాంగం శ్రద్ధ చూపడం లేదు. కేసులు భారీగా పెరిగితేనే దృష్టి పెడుతున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 52 కేంద్రాల్లో డెంగీ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు.

ఆరోగ్య ఉపకేంద్రాల అందుబాటులో కిట్లు.. ఈ కేంద్రాలు దూరంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాలకు సేవలందడం లేదు. మలేరియా ర్యాపిడ్ కిట్లను ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలోనే అందుబాటులో ఉంచాం. కిందటేడాది కంటే ఈసారి కిట్లను క్షేత్రస్థాయి వరకు అందుబాటులో ఉంచినందునే పరీక్షలు పెరిగి కేసులు బయటపడుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రామిరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details