ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంగంతో రైతుల అనుబంధం.. డెయిరీ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారు.. - sangam dairy latest news

పదిరోజులకే ఖచ్చితంగా చెల్లింపులు.. ప్రతిఏటా క్రమం తప్పకుండా బోనస్‌లు.. లక్ష్యాలను సాధించిన వారికి ప్రత్యేక బహుమతులు.. ఇవీ నాలుగు దశాబ్దాలుగా పాల ఉత్పత్తిదారులకు సంగం అందిస్తున్న సేవలు. ప్రస్తుతం డెయిరీ చుట్టూ అలుముకున్న వివాదాలు పాడి రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

sangam dairy
సంగం డెయిరీ

By

Published : Apr 29, 2021, 12:28 PM IST

సంగం డెయిరీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన రైతులు

తెలుగు రాష్ట్రాల్లో సంగం పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండే వేరు. సంగం బ్రాండ్ ఇమేజ్‌ ఎల్లలు దాటింది. నాలుగు దశాబ్దాలుగా పాల ఉత్పత్తిదారులను, వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న సంగం డెయిరీ చుట్టూ వివాదాలు అలముకోవడం పాడిరైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. డెయిరీ ఛైర్మన్‌ అరెస్ట్‌, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి డెయిరీని తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏళ్లతరబడి దీనిలో భాగస్వాములుగా ఉన్న పాడి రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే లక్షా 20 మంది సభ్యులు ఉండగా.. ప్రకాశం, చిత్తూరుతో కలిపి మొత్తం రెండు లక్షల మంది రైతులు.. సంగం డెయిరీకి పాలు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.

సాధారణంగా ప్రైవేట్ డెయిరీలు నెల, రెండు నెలలకోసారి ఉత్పత్తిదారులకు డబ్బులు చెల్లిస్తాయి. కాని సంగం మాత్రం 10రోజులకోసారి చెల్లింపులు చేస్తుందని రైతులు తెలిపారు. అదే విధంగా లాభాల నుంచి ఏటా రెండు, మూడుసార్లు బోనస్‌లు ఇస్తున్నారని తెలిపారు.

రైతులు, సిబ్బందితో పాటు గేదెలకు సైతం బీమా సౌకర్యం, పాడి పశువులకు అవసరమైన దాన, మేత, మందులు అందిస్తోందని వివరించారు. ఆస్పత్రి నిర్మించి రాయితీ వైద్యం అందిస్తున్నారని రైతులు తెలిపారు. 40 ఏళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా పాల సేకరణ సాగిందని.. ఇప్పుడు ఉన్నట్టుండి వివాదాలు సృష్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. సంగం డెయిరీ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని వారు మండిపడ్డారు.

అమూల్‌ డెయిరీకి లబ్ధి చేకూర్చేందుకే సంగం డెయిరీకి అవినీతి మరకలు అంటించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటైన డెయిరీని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని వారు ప్రశ్నించారు. ఇతర జిల్లాల్లో ప్రభుత్వ డెయిరీలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి.. ఇక్కడ మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమేంటని మండిపడుతున్నారు. సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై పాలకమండలి న్యాయపోరాటానికి దిగింది. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:సర్కారు నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో సంగం డైరెక్టర్ల పిటిషన్

ABOUT THE AUTHOR

...view details