రాష్ట్రంలో నిర్మాణ రంగం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గుంటూరు జిల్లా ఒకటి. అయితే ఇసుక లభ్యత సరిగ్గా లేకపోవటంతో నిర్మాణాలు ముందుకు కదలడంలేదు. నిన్నా మొన్నటివరకు లాక్డౌన్తో ఆగిపోయిన పనులు.. ఆంక్షల సడలింపులతో మొదలుపెట్టినా ఇసుక కొరతతో ఊపందుకోవడంలేదు. నిర్మాణ పనులు మొదలవటంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది.
మీసేవా కేంద్రాలతో పాటు గ్రామ సచివాలయాల్లోనూ ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. అయితే బుక్ చేసుకున్న చాలారోజులకు ఇసుక ఇంటికి చేరడం లేదని వినియోగదారులు చెప్తున్నారు. డిమాండ్ భారీగా ఉండడం, వాహనాల కొరతతో సమయానికి ఇసుక అందడంలేదు. వచ్చిన ఇసుక నాణ్యత బాగుండడంలేదని వాపోయారు.
ఎదురుచూపులు తప్పడంలేదు
ప్రస్తుతం జిల్లాలో 5 లక్షల టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయి. వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా 10.50 లక్షల టన్నులు రిజర్వ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. యార్డులలో 55 వేల టన్నుల ఇసుక ఉన్నట్లు చెప్తున్నారు. దానిని ముందుగా వినియోగదారులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. అయితే చాలామందికి ఇసుక సకాలంలో అందటం లేదు. ఆన్ లైన్లో డబ్బులు చెల్లించినా ఇసుక రావట్లేదని చెప్తున్నారు. తెలిసిన వారి వాహనాలు తీసుకుని యార్డుకు వెళ్లే వారికి కొంత త్వరగానే వస్తుంది. అలా కాకుండా వాళ్లే పంపిస్తారునే అని వేచి చూస్తే... ఎదురు చూపులు తప్పటం లేదంటున్నారు వినియోగదారులు.