Sand Prices in AP: కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలు ఆగిపోవటం.. అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వం ఖరారు చేసిన ధరల కన్నా అధికంగా వసూలు చేస్తూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలోని ఇసుక రీచ్‌లలో టన్ను ఇసుక 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. నిర్ణయించిన ధరకే విక్రయించాలని ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అధిక ధరలతో అడ్డగోలుగా దోచుకుంటున్నా.. చర్యలు లేవు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాల వ్యవహారాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధి కీలకంగా ఉండటంతో ప్రశ్నించటానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో గుంటూరు, పల్నాడు జిల్లాలో కృష్ణా నది నుంచి తోడి నిల్వచేసిన ఇసుక ధరలకు.. రెక్కలొచ్చాయి. మంగళగిరి నియోజకవర్గంలో డంపింగ్‌యార్డులో టన్ను ఇసుక ప్రభుత్వ ధరల ప్రకారం 605 రూపాయలు, తెనాలిలో 535 రూపాయలుగా ఉంది. పెదకూరపాడులో 565 రూపాయలకు విక్రయించాలి. కానీ 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. రవాణా, ఇతర ఛార్జీలు కలిపి వినియోగదారులకు చేరేసరికి టన్ను ఇసుక వెయ్యి 50రూపాయల నుంచి 1,200 అవుతోంది.
Sand Price In AP: ఇసుక ధరల్లో కనికట్టు.. గనులశాఖ మాయాజాలం..!
డిమాండ్ పెరిగేకొద్దీ ఇసుక ధర పెంచుతున్నారు. డంపింగ్ యార్డు వద్ద ఇచ్చే బిల్లులో ఇసుక పరిమాణం మాత్రమే నమోదు చేస్తున్నారుగానీ.. ధర ఎంతనేది పేర్కొనటం లేదు. నదిలో తవ్వకాలు లేకపోవడం, మరో మార్గం లేక చెప్పిన ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసి బయట విక్రయిస్తున్నారు. టన్ను 400 రూపాయలకు పైగా పెరగడంతో వినియోగదారులకు భారంగా మారింది. జేపీ సంస్థ నుంచి తవ్వకాలను తీసుకున్న పల్నాడు జిల్లా నదీతీర ప్రాంత నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి కృష్ణానదిలో ఇసుక తవ్వి రీచ్‌ల సమీపంలో నిల్వచేశారు.