ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన ఏపీఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన సభలో సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గత నెల ఉద్యోగ విరమణ చేసిన చంద్రశేఖర్ రెడ్డిని సజ్జల, మంత్రి వెల్లంపల్లి, ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా సన్మానించారు.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అన్న ఆలోచన తప్ప.. ఎప్పుడూ వ్యతిరేక భావన సీఎం జగన్ మోహన్ రెడ్డి లేదని స్పష్టం చేశారు. త్వరలోనే సీపీఎస్ రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగులను ఎలాంటి వేధింపులకు గురిచేయదని సజ్జల అన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సంధాన కర్తగా చంద్రశేఖర్ రెడ్డిని నియమించే ఆలోచన ఉందని వెల్లడించారు.