rythu kosam telugudesam in dachepalli: గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవసభ.. ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమాన్ని(రైతు కోసం తెలుగుదేశం) నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. నేను తప్పు చేసి ఉంటే.. శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా.. అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాచేపల్లి సభలో ఉద్వేగానికి లోనయ్యారు. మన మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గురజాల సహా రాష్ట్రంలో పార్టీని పట్టుదలతో గెలిపించుకుందామని చెప్పారు. నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని కాపాడతానన్నారు. తాను మారానని.. మరింత మారతానంటూ పదేపదే చెప్పారు. జనవరి నుంచి ప్రతి గ్రామంలో తిరిగి, ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుస్తానన్నారు.
పల్నాడులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొవస్తాం
పల్నాడులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొవస్తామని.. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవొద్దని యరపతినేని శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. అన్యాయాలు, అరాచకాలు చేస్తున్న వైకాపా నాయకులకు చట్ట ప్రకారం శిక్ష తప్పదని.. వాళ్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో దాక్కున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తామర పురుగుతో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.