భారంగా మారుతున్న రైతు భరోసా కేంద్రాలు YSRCP government neglected Rythu Bharosa Centres: వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు గణనీయ మార్పు తీసుకొస్తాయని, వీటి ద్వారా అన్నదాతలను చేయిపట్టుకుని నడిపిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం బాకాలు ఊదుతోంది. ప్రపంచమే హద్దు అన్నట్లుగా ప్రచారంలో మునిగితేలుతోంది. కానీ రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్కడ అన్నదాతలకు అందించాల్సిన సేవల్ని గాలికొదిలేసింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తామని నమ్మబలికినా, రైతులకు కావాల్సినవేవీ అక్కడ దొరకవు. అందుకే వాటిల్లో నామమాత్ర విక్రయాలే జరుగుతున్నాయి. మరోవైపు అక్కడ పనిచేసే వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య, పట్టు శాఖల సహాయకుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాటిల్లో సరిపడా సిబ్బంది లేరు. పనిచేసే వారికి కనీస సౌకర్యాలూ లేవు. ముఖ్యంగా వేల మంది మహిళా ఉద్యోగులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించకుండా వారి ఆరోగ్యాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. కనీసం కొత్తగా నిర్మించే భవనాల్లో అయినా వాటిని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా వైఎస్సార్సీపీ సర్కారుకు లేకపోయింది.
ఆర్‌బీకేల్లో ప్రస్తుతం 2500 నుంచి 3000 మంది వరకు మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మరుగుదొడ్లు లేకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. అత్యవసరాలను తీర్చుకోవడానికి కొందరు పక్కనే ఉన్న సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి అవకాశం లేని వారు కేంద్రాలకు సమీపంలోని ఇళ్ల వారిని బతిమిలాడుకోవడమో, లేదంటే ఇంటికి వెళ్లే వరకు ఉగ్గబట్టుకోవాల్సి వస్తోంది.
అద్దె భవనాల్లో నడుస్తున్న ఆర్‌బీకేల్లో చాలాచోట్ల మరుగుదొడ్లు లేవు. కొత్తగా కట్టే వాటిలోనూ చాలాచోట్ల వీటిని ప్రతిపాదించలేదు. మొత్తం 10,218 ఆర్‌బీకేలకు కొత్త భవనాల్ని నిర్మించాలని నిర్ణయించిన సర్కారు ఒక్కో భవనానికి 24 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడుతోంది. తొలుత ప్రతిపాదించిన 21లక్షల 80వేల రూపాయలు చాలవని, తర్వాత అంచనా వ్యయాన్ని పెంచింది. అప్పుడు కూడా మరుగుదొడ్ల నిర్మాణం ఊసే లేకుండా చేసింది.
ప్రభుత్వం గొప్పలు.. ఆర్‌బీకేల్లో తప్పని తిప్పలు.. విజిలెన్స్ తనిఖీల్లో నిజాలు
రైతు భరోసా కేంద్రాల నిర్వహణలో భాగంగా ఇంటర్నెట్, స్వీపర్, స్టేషనరీ నిమిత్తం నెలకు 2వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం తొలినాళ్లలో ప్రకటించింది. కానీ రెండేళ్లుగా పైసా ఇవ్వడం లేదు. స్టేషనరీ భారమంతా సిబ్బందిపైనే పడుతోంది. ఇంటర్నెట్ ఛార్జీలకు వారే ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతినెలా బిల్లులు పెట్టినా ఇవ్వడం లేదు. కార్యాలయాల విద్యుత్తు బిల్లులను కూడా సిబ్బందే చెల్లించాల్సి వస్తోంది. రసీదులు సమర్పిస్తే, తర్వాత ప్రభుత్వం వారికి ఇస్తుందని చెబుతున్నారు. నేరుగా ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అద్దెలు సరిగా చెల్లించడం లేదని భవన యజమానులు కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. వారి ఆగ్రహం ప్రభుత్వం చెవులకు వినిపించడం లేదు.
Village Secretariats and RBKs Works Stopped: కృష్ణా జిల్లాలో నిలిచిపోయిన సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలు.. వేధింపులే కారణమా..?
రైతు భరోసా మాసపత్రికల పేరుతోనూ సిబ్బందిని బాదేస్తున్నారు. ఒక్కో సహాయకుడు ఏడాది చందాగా 300 రూపాయల చొప్పున 15 మందితో 4వేల500రూపాయలు చందాలు కట్టించాలి. రైతులేమో ఆసక్తి చూపడం లేదు. పైనుంచి ఒత్తిళ్లు భరించలేక సహాయకులే ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఎరువుల విక్రయాల బాధ్యతను ఆర్‌బీకే సిబ్బందికే అప్పగించారు. అర్ధరాత్రి సమయంలో ఎరువుల లారీ వస్తే మహిళా ఉద్యోగి అక్కడే ఉండి బస్తాలను అన్‌లోడ్ చేయించాలి. అవసరమైతే తెల్లారిందాకా ఉండాల్సిందే. ఆ సమయంలో మహిళలు ఎలా వస్తారనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎరువులను సహకార సంఘాల ద్వారా రైతులకు విక్రయించే వీలున్నా.. ఆర్‌బీకే లే గొప్ప అని చెప్పడానికి సిబ్బంది నెత్తికి చుట్టారు. ఎరువుల అమ్మకాలకు సంబంధించి కొంత మొత్తాన్ని కమీషన్‌గా చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటివరకు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్కో ఆర్‌బీకే పరిధిలో భూసార పరీక్షల నిమిత్తం 20 నమూనాలు తీయాలని.. వాటికీ అదనంగా చెల్లింపులు చేస్తామన్నారు. వాటినీ విడుదల చేయలేదు. పంట కోత ప్రయోగాల బాధ్యతను కూడా ఆర్‌బీకేల సిబ్బందికే అంటగట్టారు. వాటికి కూడా పైసా మంజూరు చేయలేదు.
FARMER WITH PLACARD: సీఎం సార్.. ఆర్‌బీకే అద్దె ఇప్పించండి-ప్లకార్డుతో ఇంటి యజమాని వినతి