Rythu Bharosa Centers are not Useful to Farmers:రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా కేంద్రాలే కళ్లు, చెవులుగా పనిచేయనున్నాయంటూ ముఖ్యమంత్రి చెబుతున్న గొప్పలు చూశారుగా.. రైతు భరోసా కేంద్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని.. గతంలో మన రాష్ట్ర అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి పథకాలను పరిశీలించేవారని.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయని ప్రభుత్వం ఊదరగొడుతోంది. వ్యవసాయరంగంఊసెత్తితే చాలు రైతు భరోసా కేంద్రాలతో ఉద్ధరిస్తున్నామంటూ సీఎం గొప్పలు చెబుతారు. కానీ గ్రామాల్లోకి వెళ్లి రైతులను కదలిస్తే తెలుస్తుంది. వాటి పనితనం ఏపాటిదో విత్తనాలు, పురుగుల మందులు అందించడం దేవుడెరుగు.. తాము కష్టపడి పండించిన పంటలను సైతం కొనుగోళ్లు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు.
Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి 40 నెలలవుతోంది. ఇప్పటివరకు వీటిద్వారా అమ్మిన మొత్తం పురుగు మందులు ఎంతో తెలుసా? ఒక్కో కేంద్రానికి సగటున 12.60 లీటర్లే. అంటే నెలకు అర లీటరు మందు కూడా విక్రయించలేదు. పత్తి, మిరప, మొక్కజొన్న విత్తనాల విక్రయం చూసినా అంతే. నెలకు కిలో చొప్పున లేవు. ఎరువుల అమ్మకాలూ నామమాత్రమే. ఒక్కో కేంద్రంలో సగటున 750 బస్తాల ఎరువులనూ విక్రయించలేకపోయారు. ఇందుకేనా జాతీయస్థాయిలో అవార్డులు వచ్చింది..? పట్టుమని పదిమంది రైతులకూ విత్తనాలివ్వలేకపోవడాన్ని గుర్తించేనా ప్రభుత్వానికి సత్కారాలు చేసింది అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవాలను కప్పిపుచ్చి.. ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేస్తోంది. కనీసం ఈ కేంద్రాల్లో టీవీలు పని చేయడం లేదని, ఇంటర్‌నెట్ రావడం లేదని, కియోస్క్‌లు మొరాయించాయన్న సంగతైనా ముఖ్యమంత్రికి తెలుసా అంటూ నిలదీస్తున్నారు. మొక్కుబడి సేవలందించే ఈ ఆర్‌బీకేల భవన నిర్మాణాల కోసం మాత్రం ప్రభుత్వం 2 వేల446 కోట్లు వెచ్చిస్తోంది. మౌలిక సదుపాయాలతో కలుపుకుంటే మొత్తం ఖర్చు 3 వేల కోట్లకు చేరనుంది. ప్రచార ఆర్భాటానికి భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వం.. వాటిల్లో అందుతున్న సేవలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్బీకేల పనితీరు బాగా లేదని, సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ అధ్యయన సంస్థలు తలంటుతున్నా కళ్లు తెరవడం లేదు.