ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RUSA Funds Diversion in AP: ‘రూసా’కూ సర్కారు దెబ్బ!.. ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లింపు - కేంద్ర ప్రభుత్వం రూసా

State Government Diverted the RUSA Funds Given by the Central: విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇచ్చే వాటినీ ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ కింద కేంద్రం నిధులిస్తే.. కనీసం 40 శాతం మ్యాచింగ్ గ్రాంటును ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. తాము ఇచ్చిన నిధులు ఖర్చు చేసి, ధ్రువపత్రాలు ఇవ్వాలని కేంద్రం హెచ్చరిస్తున్నా కనీసం పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన 176 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసింది.

RUSA Funds Diverted in AP
RUSA Funds Diverted in AP

By

Published : Aug 4, 2023, 9:07 AM IST

ఉన్నత విద్యా సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లింపు

YSRCP Government Diverted the RUSA Funds Given by the Central: 'ఆక్స్‌ఫర్డ్‌, హార్వర్డ్, కేంబ్రిడ్జి వాళ్ల పాఠ్యపుస్తకాలు, బోధన పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం విభిన్నంగా ఉంటుంది. మనకు, వారికి ఎందుకు తేడా. ఇవి చేయకపోతే వెనుకబడతాం' అంటూ.. జులై 13న వీసీల సమావేశంలో సీఎం జగన్ అన్న మాటలివి. కానీ చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుంది ముఖ్యమంత్రి తీరు. ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న రూసా నిధులను ఇతర అవసరాలకు వాడేసుకుంటోంది. నిధులు ఖర్చు చేసి, ధ్రువపత్రాలు ఇస్తే మిగతా వాటిని విడుదల చేస్తామని కేంద్రం పదేపదే హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా ఉండడం లేదు. చివరికి గుత్తేదారు బిల్లుల కోసం కోర్టు మెట్లు ఎక్కితేగాని చెల్లించని దుస్థితి.

న్యాయస్థానం ఆదేశాలతో ఇటీవల గుత్తేదార్లకు ప్రభుత్వం 48కోట్ల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రూసా కింద రెండు విడతలకు కలిపి 857 కోట్ల 47 లక్షలు మంజూరు చేసింది. దీనికి రాష్ట్రం వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. 2020 మార్చి నాటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నా కేంద్రం కరోనా, ఇతరత్రా కారణాలతో గడువు పొడిగిస్తూ వస్తోంది. కేంద్రం తన వాటాగా 514 కోట్ల 48 లక్షలు ఇవ్వాల్సి ఉండగా 338 కోట్ల 23లక్షలు ఇచ్చింది. నిధుల వినియోగం ధ్రువపత్రాలు ఇస్తే 60 శాతం కింద మిగతా 176 కోట్ల 25 లక్షలు ఇస్తామంటోంది.

కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా మౌనంగా ఉంటోంది. దీని వల్ల విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో పనులు నిలిచిపోయాయి. సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మౌలికసదుపాయాలు కల్పిస్తే జాతీయ ర్యాంకుల్లోనూ విద్యాసంస్థలు ముందుండేందుకు అవకాశం ఉంటుంది. విద్యపై శ్రద్ధ చూపుతున్నామని..భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పడం తప్ప ..విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం గాలికి వదిలేసింది.

రూసా కింద ఉన్నత విద్య సంస్థలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులిస్తామన్నా ప్రభుత్వం తన వాటా ఇవ్వలేకపోవడంతో.. వర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. చాలా వర్శిటీల్లో అమ్మాయిలకు వసతి గృహాలు సక్రమంగా లేవు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ వసతులు వెక్కిరిస్తున్నాయి. ఇలాంటప్పుడు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేయకుండా.. ఇచ్చిన వాటినీ వాడేసుకొంటోంది. ఫలితంగా ఉన్నత విద్య చదివే పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు ఒక్కోదానికి 100 కోట్ల చొప్పున కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. గుత్తేదారు పనులను నిలిపివేశారు. ఇప్పటి వరకు కేవలం 41కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఈ నిధులు ఖర్చు చేస్తే మిగతా వాటిని కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు నిధులు వ్యయం చేయలేకపోవడంతో వర్సిటీల్లో అభివృద్ధి నిలిచిపోగా.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.

ఉన్నత విద్యలో లింగ సమానత్వం, వెనుకబడిన ప్రాంతాల్లో అన్ని సదుపాయాలతో డిగ్రీ విద్య అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కొత్త ఆదర్శ డిగ్రీ కళాశాలలు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. రూసా కింద కేంద్రం రాష్ట్రానికి 8 ఎన్ఎండీసీలను మంజూరు చేసింది. ఒక్కో దానికి 12కోట్ల రూపాయలు ఇచ్చింది. కేంద్రం నిధులిస్తున్నా ఇప్పటికీ ఎర్రగొండపాలెం, జగ్గంపేట కళాశాలలు పూర్తి కాలేదు. అకడమిక్ భవనం, హాస్టల్స్​, కంప్యూటర్ల ల్యాబ్, లైబ్రరీ, భోజనశాల, ఆడిటోరియం నిర్మించాల్సి ఉంది. ఎర్రగొండ పాలెంలో అమ్మాయిలు, అబ్బాయిల వసతిగృహాలు, తరగతి గదులు ఇంకా పూర్తి కాలేదు. అసంపూర్తి భవనంలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. జగ్గంపేట కళాశాలలో అబ్బాయిల వసతిగృహం నిర్మాణాలే ప్రారంభించలేదు. ప్రహరీ, వసతిగృహం నిర్మాణానికి కోటి 50లక్షలు వ్యయమవుతుందని అంచనా.

రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు ఉన్న 33 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలకు కేంద్రం రూసా నిధులు ఇచ్చింది. విజయవాడలోని ఆంధ్ర లయోలా, ఏలూరులోని థెరిస్సా కళాశాలలకు 5 కోట్ల చొప్పున.. మిగతా 31 కళాశాలలకు 2కోట్లు చొప్పున నిధులు విడుదల చేసింది. ఆంధ్ర లయోలాకు ఇప్పటి వరకు మూడున్నర కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలను నిలిపివేసింది. ఆ తర్వాత వెనక్కి వెళ్లేందుకు ఐచ్ఛికం ఇవ్వడంతో ఎయిడెడ్‌లోకి వెళ్లిపోయాయి. వీటికి నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. గుంటూరులోని హిందూ కళాశాలకు 2కోట్లు మంజూరు కాగా.. ఈ కళాశాలకు కోటి మాత్రమే విడుదల చేశారు. మిగతా కోటి కోసం నిధులు ఖర్చు చేసి, యూసీలు ఇచ్చినా నిధులు ఇవ్వడం లేదు.

ABOUT THE AUTHOR

...view details