రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం ఇచ్చిన రూ.25 వేల చెక్కు చెల్లలేదు. విజయవాడకు చెందిన బాధితురాలు.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వం రెండు చెక్కులు ఇచ్చింది. రూ.5 లక్షల చెక్కును ఆ కుటుంబం మార్చుకుంది. దీనికి సంబంధించిన నగదు వారి ఖాతాలో జమ అయింది. దీంతోపాటు గుంటూరు ఐసీడీఎస్ అధికారులు రూ.25వేల చెక్కు ఇచ్చారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు బ్యాంకుకు వెళ్లి దానిని డిపాజిట్ చేశారు. మంగళవారం బ్యాంకులో ఆరా తీయగా ఖాతాలో డబ్బు లేని కారణంగా చెక్కు చెల్లలేదని సమాధానం ఇచ్చారని వారు తెలిపారు. బుధవారం గుంటూరు ఐసీడీఎస్ అధికారులు తమకు ఫోన్ చేశారని.. ఒకట్రెండు రోజుల్లో డబ్బు వేస్తామన్నారని వివరించారు. చెక్కు జారీ చేసిన ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతోనే చెల్లలేదని మరో ఖాతా నుంచి డబ్బు ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్ అధికారులు వివరణ ఇచ్చారు.