విజయదశమి పర్వదినాన కళకళలాడాల్సిన బస్ స్టేషన్లు వెలవెలబోతున్నాయి. కరోనా వ్యాప్తి భయంతో ప్రయాణికులు రాకపోవడం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పడం లేదు. సాధారణ సమయాల్లో గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ నుంచి రోజుకు 74 బస్సులు తిరుగుతుండగా.. ప్రస్తుతం ఒక్క బస్సు కూడా అందుబాటులో లేకుండా పోయింది. ప్రయాణికులు కార్లను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణకు నిలిచిన ఆర్టీసీ సేవలు.. బోసిపోతున్న గుంటూరు బస్టాండ్ - RTC services from Guntur to Hyderabad have been suspended.
దసరా పండగ వచ్చిందంటే చాలు.. నిత్యం ప్రయాణికులు, బస్సుల రాకపోకలతో రద్దీగా కనిపించే బస్టాండ్లు.. నేడు బోసిపోతున్నాయి. ఓ వైపు కరోనా.. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య పొత్తు కుదరకపోవటంతో గుంటూరు బస్టాండ్లోని బస్సులు కదలని పరిస్థితి నెలకొంది.
కళతప్పిన గుంటూరు బస్టాండ్
హైదరాబాద్ వెళ్లేందుకు నేరుగా బస్సుల్లేని పరిస్థితుల్లో తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన దాచేపల్లి మండలం వాడపల్లి, మాచర్ల సమీపంలోని విజయపురి సౌత్ వరకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతున్నారు. మంగళవారం రెండు రాష్ట్రాల ప్రతినిధుల చర్చల తర్వాత మళ్లీ ఆర్టీసీ ఆంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయనేది స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:పండగ పూట ప్రయాణికుల వ్యథలు...