RTC Merger Issues for Employees: ఆర్టీసీని (APSRTC) ప్రభుత్వంలో వీలీనం చేయగానే ఉద్యోగులంతా సంబరపడ్డారు. ఇకపై తామూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రయోజనాలు అందుకోవచ్చని ఆశపడ్డారు. కానీ మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వారికి చుక్కలు చూపిస్తోంది. విలీన అంశాలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో ఉద్యోగ , కార్మిక సంఘాల ఆందోళనలతో ఆర్టీసీ యాజమాన్యం కాస్త కనికరించేది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తామేమీ చేయలేమని ప్రభుత్వం వద్ద సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయంటూ యాజమాన్యం చేతులెత్తేస్తోంది.
ప్రతి అంశంపై ఏదో విధంగా ప్రభుత్వం కొర్రీలు వేసి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు మొదలు కానుండగా ఇప్పటికీ విలీన అంశాలు పరిష్కారం కాకపోవడంతో వారిలో ఆందోళన కలిగిస్తోంది. విధులకు హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు డేఅవుట్, నైట్ అవుట్ వంటి భత్యాలు ఉంటాయి. గత సంవత్సరం ఆగస్టు వరకు వారి జీతాలు ఆర్టీసీ విధానం ప్రకారం ప్రభుత్వం ఇచ్చేది. గత సెప్టెంబర్ నుంచి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశారు. అప్పటి నుంచి భత్యాల్లో సందిగ్ధత నెలకొంది. ఓవర్ టైం డ్యూటీ చేసిన వారికి ప్రతినెలా భత్యం ఇవ్వకుండా రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారు.
APSRTC Recruitment: ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది కొరత.. ఖాళీల భర్తీ ఎప్పుడు..?
నిత్యం మూడు వేల నైట్ సర్వీసుల్లో విధులకు హాజరయ్యే డ్రైవర్, కండక్టర్లకు నైట్ అవుట్ అలవెన్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల్లో నైట్ అవుట్ లేదని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో ఈ భత్యం కింద రోజు 90 రూపాయలు ఉండగా.. ప్రభుత్వంలో అయితే రూ.400 నుంచి 600 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీరికి ఏదీ అందడం లేదు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులపై యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. వారు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయంది.
దీంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వందలాది అప్పీల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్నప్పుడు పదవీ విరమణ చేసిన 32 వేల మంది ఉద్యోగులకు నెలకు సగటున 3 నుంచి 5 వేల వరకే ఈపీఎఫ్ పింఛన్ వస్తోంది. విలీనం తర్వాత సర్వీసులో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పింఛన్ వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. ఇప్పటికీ దీనిపై స్పష్టత లేదు. ఈపీఎఫ్‌లో హయ్యర్ పింఛన్‌కు ఆప్షన్ పెట్టుకున్న ఉద్యోగులు భారీ మొత్తం చెల్లించాలంటూ నోటీసులు వస్తున్నాయి. అయితే ఎంత పింఛన్ వస్తుందో అందులో పేర్కొనడం లేదు. మొత్తంగా పింఛను విషయంలో ఆర్టీసీ ఉద్యోగుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది..
RTC Employees Bills Peding: లంచం ఇస్తే సరి.. లేకుంటే నెలల తరబడి వేచి చూడాల్సిందే