గుంటూరు జిల్లా నూతక్కి విజ్ఞాన విహార్ పాఠశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్- ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్‌ల రెండు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాభారతి, హైదరాబాద్ ధనుష్ ఇన్ఫోటెక్ అభివృద్ధి చేసిన రక్త సేవా యాప్ ఆయన ఆవిష్కరించారు. ఈ యాప్ రక్త దాతను, స్వీకర్తని అనుసంధానం చేసి ఎక్కువ మందికి ఉపయోగపడేలా అభివృద్ధి చేశారని అన్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రక్త సేవా యాప్ డౌన్లోడ్ చేసుకొని పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని... రక్తం/ ప్లేట్ లెట్స్/ ప్లాస్మా కోసం ఈ యాప్ ద్వారా తమ అభ్యర్థన తెలియజేయొచ్చని చెప్పారు. రక్తం, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా కోరిన మూడు గంటల లోపు దాతల నుంచి అంగీకార సమాచారం వస్తుందన్నారు. ఒకవేళ దాతల నుంచి సమాచారం రాకపోతే.. కాల్ సెంటర్ 040-4821-4920 కి ఫోన్ చేస్తే రక్త దాతలతో మాట్లాడి రక్తం అందేలా చూస్తారని సేవాభారతి ప్రతినిధి పృధ్వీరాజ్ తెలిపారు.
విభాగ్ ప్రచారక్ సమావేశం
కరోనా సమయంలో స్వయం సేవకుల సేవలు, వలస కార్మికుల స్థితిగతులు, గ్రామాల వికాసం, ప్రకృతి పరిరక్షణ, జలసంరక్షణ, దేశంలో ఆదర్శ కుటుంబ వ్యవస్థ, సామాజిక సమరసత కార్యక్రమాలు, సంఘశాఖలు, కార్యప్రగతి తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. కరోనా కారణంగా నెలకొన్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేవలం రాష్ట్రస్థాయి ప్రముఖులను మాత్రమే ఈ సమావేశాలకు ఆహ్వానించారు. రెండు, మూడు జిల్లాలు ఒక యూనిట్‌గా విభాగ్ ప్రచారక్ ఉంటారు. రేపు విభాగ్ ప్రచారక్‌లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు.