గోవా నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న రూ.44 లక్షల విలువచేసే మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామానికి చెందిన రామావత్ అశోక్ నాయక్ గోవాలో తక్కువ ధరకి మద్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోని పలు ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నటు తెలిపారు. అక్రమ మద్యాన్ని సిమెంట్ బల్కర్ లారీలో లోడ్ చేసుకుని ఏపీకి నేరుగా కాకుండా..తెలంగాణ మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో నిల్వ ఉంచి అక్కడ నుంచి కొద్దికొద్దిగా గుంటూరు జిల్లాకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్ఈబీ...సంగారెడ్డిలో ఉన్న లారీ, ఓ కారు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకునట్లు తెలిపారు.
ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44 లక్షల విలువ చేసే 523 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నామన్నారు. లారీ, కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు.