గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. అమరావతి కాలనీకి చెందిన రౌడీషీటర్ తరుణ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతకక్షల నేపథ్యంలో దుండగులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని సీఐ రాఘవేంద్ర చెప్పారు.
అమరావతి కాలనీకి చెందిన చప్పిడి తరుణ్ (30)ను గుర్తుతెలియని దుండగులు అదే కాలనీలో కత్తులతో నరికి చంపారు. ఇతనికి సంవత్సరం క్రితమే వివాహం అయింది. పూలు కడుతూ జీవనం సాగిస్తున్నాడు.
వెంబడించి పొడిచారు...
కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద నిలబడి ఉన్న తరుణ్‌ను ముగ్గురు వ్యక్తులు వెంటపడి కత్తులతో పొడిచారని పోలీసులు, స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తర్వాత తరుణ్ కొంతదూరం పరిగెత్తినట్లు చెప్పారు. ఈ హత్య పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. హంతకులు పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల నిఘా ఉన్నప్పటికీ..
లాక్ డౌన్ సమయం కావడంతో పట్టణమంతా పోలీసులు పహారా కాస్తున్నారు. అయినప్పటికీ హత్య జరగడం విమర్శలకు తావిస్తోంది. రౌడీషీటర్లపై పోలీసుల నియంత్రణ లేకపోవడంతో హత్యలు చేయడానికి వెనకాడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:Gold seize: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద బంగారం పట్టివేత