గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై అఖిల పక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు , సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ , తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు.
బడ్జెట్‌పై అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం - guntur latest news
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో తెదేపా, సీపీఐ, జనసేనతోపాటు అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు హాజరై.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
రాష్ట్ర హక్కుల ప్రయోజనాల సాధన కోసం అన్ని పార్టీలు కలసికట్టుగా రావాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. కోవిడ్ కారణం చూపి రెండు రోజుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్ లో ఎటువంటి అదనపు కేటాయింపులు కనపడలేదన్నారు.
అనంతరం సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మాటల గారడీ, అంకెల గారడీ ఎక్కువని.. వాస్తవ ప్రజా ప్రయోజనాలు తక్కువని ఆరోపించారు. ఈ బడ్జెట్ లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం కేవలం 200 కోట్లు మాత్రమే పెట్టారని ,20 లక్షల అగ్రిగోల్డ్ కుటుంబాలను మోసగించారన్నారు.