ఘాట్‌రోడ్డు రెండో దశ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో
రాకపోకలకు అవస్థలు
చారిత్రక కొండవీడు కోటకు ప్రపంచ పర్యటక పటంలో ప్రత్యేక స్థానం కల్పించేలా బృహత్తర అభివృద్ధి ప్రణాళిక చేపట్టారు. రూ.కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం కొంతమేర పూర్తికాగా, చాలా వరకు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మొత్తం మీద కీలకమైన పర్యటక ప్రాజెక్టుకు సంబంధించి చేసిన పనులు కొన్నే కాగా, చేయాల్సినవి కొండవీడు చాంతాడులా ఎన్నో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చారిత్రక కట్టడాలతో పాటు ఇటీవల చేపట్టిన నిర్మాణాలు ఆకతాయిల చేతుల్లో ధ్వంసమవుతున్నాయి. విలువైన ప్రజాధనం వృథాగా మారుతోంది.
*కొండవీడు వైభవాన్ని చాటిచెప్పేలా గత ప్రభుత్వం 2019లో కొండవీడు ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. కొండపై పర్యటకులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించేందుకు పనులు చేపట్టారు. ఈలోగా ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పనులు చేపడతామని, పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు కొండవీడులో పర్యటించారు. చేపట్టాల్సిన పనులపై జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేశారు. సచివాలయంలోనూ సమీక్షలు జరిపారు. ప్రజాప్రతినిధుల సందర్శనలు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాలకు తప్ప ఆచరణలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన ఘాట్‌రోడ్డు రెండో దశ నిర్మాణ పనులు పూర్తిచేయాల్సి ఉంది. పురాతన లక్ష్మీనరసింహ ఆలయ పునర్నిర్మాణాన్ని సగంలోనే నిలిపేశారు. మూడు పురాతన చెరువుల ఆధునికీకరణ ముందుకు సాగలేదు. పర్యటకులకు తాగునీరు, మరుగుదొడ్లు, షెల్టర్ల పనులు అసలు ప్రారంభించనే లేదు. బోయపాలెం నుంచి కొండవీడుకు ఉన్న రహదారి విస్తరణ పనులు కూడా ఆగిపోయాయి. కొండపై లైటింగ్ వంటి మరికొన్ని పనులు ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయాయి.
కొరవడిన పర్యవేక్షణ