నత్తనడకగా రహదారి విస్తరణ పనులు Road Widening Works in Guntur People Facing Problems: గుంటూరులో రహదారుల విస్తరణ పనులు స్థానికులకు చుక్కలు చూపుతున్నాయి. నెలలు గడుస్తున్నా పనులు ముందుకు సాగక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోని రోడ్లు బాగుపడతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. నగరంలో ప్రధానమైన ఏటీ అగ్రహారం రోడ్డు తీవ్రంగా పాడైపోగా.. స్థానికుల ఫిర్యాదుతో నగరపాలక సంస్థ మరమ్మతులు చేపట్టడమేగాక రహదారి విస్తరణకు ముందుకొచ్చింది.
ఏటీ అగ్రహారం రోడ్డు పనులు మాత్రమే కాకుండా పలకలూరు, డొంకరోడ్డు విస్తరణ సైతం చేపట్టారు. గతేడాది డిసెంబర్‌లో ఏటీ అగ్రహారం రోడ్డు విస్తరణ చేపట్టినా.. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు పనులు ముందుకు సాగడం లేదు. కాలువ నిర్మాణం కోసం ఇళ్ల ముందు మొత్తం తవ్వేయడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. నెలల గడుస్తున్నా పనులు పూర్తి చేయకపోడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు విస్తరణ పనుల కోసం ఎదురుచూస్తున్నాము. రోడ్డుకు ఇప్పుడు మోక్షం లభించింది అనుకున్నాము. కానీ, పనులలో అలస్యం అవుతోంది. ప్రజలు పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో అని ఎదురుచూస్తున్నారు. రోడ్డు పక్కన కాలువలు తవ్వి వదిలేశారు. వాటి నిర్మాణం చేపడితే బాగుంటుంది." -స్థానికుడు
"రోడ్డు విస్తరణలో భాగంగా మా స్థలంలో మార్కింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మార్కింగ్‌ను మరింత దూరానికి పెంచారు. దీనివల్ల మేము మా స్థలాన్ని ఎక్కువగా కొల్పోతున్నాము. అప్పటికీ ఇవ్వటానికి రెడీగా ఉన్నాము. కానీ, పరిహరం కావాలని అడిగాము."-స్థానికుడు
రహదారి విస్తరణ కోసం అడ్డుగా ఉన్న ఇళ్లు, దుకాణాలు తొలగించారు. కొందరి స్థలాలను సేకరించారు. వీటిన్నింటికీ నగరపాలక సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంది. బాధితులకు బాండ్లు ఇవ్వాల్సి ఉండగా....ఆ ప్రక్రియ పూర్తికాలేదు. అధికారులు ఇస్తున్న పరిహారం సరిపోదంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో కొన్నిచోట్ల పనులు నిలిచిపోయాయి. అధికారుల బెదిరింపు ధోరణి వల్లే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు ఉండకూడదని ప్రణాళికాబద్ధంగా పనులు చేయడం వల్లే కొంత ఆలస్యమవుతోందని మేయర్ తెలిపారు.
"మొదటగా స్థలసేకరణ. ఆ తర్వాత వారికి పరిహారం అందిచటం. ఎటువంటి వివాదాలు లేకుండా మారిన తర్వాత పనులు ప్రారంభించటం. విస్తరణలో అడ్డుగా ఉన్న వాటిని వివాదాలు లేకుండా పరిష్కరించిన తర్వాత కూల్చీవేయటం. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను పక్కకు జరపటం. డ్రైనేజిని పక్కకు జరపటం. ఆ తర్వాత రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేయాలి. ఇదంతా చాలా సమయం తీసుకునే వ్యవహరం. నెల రోజులు.. రెండు నెలల్లో పూర్తయ్యే పనులు కాదు." మనోహర్ నాయుడు, గుంటూరు మేయర్