ఎన్డీబీ ప్రాజెక్టు రహదారుల పనుల్లో జాప్యం.. నత్తనడకన మొదటి దశ పనులు Road condition in AP:న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే విదేశీ బ్యాంకు రుణంతో రహదారులకు మహర్దశ రానుందని.. నవంబరు 4న 2019న సీఎం జగన్ ఆర్ అండ్ బీ అధికారులతో జరిగిన సమీక్షలో గొప్పగా చెప్పారు. 6వేల 400 కోట్ల రూపాయలతో దాదాపు 3 వేల 100 కిలో మీటర్ల మేర రహదారులు, వంతెనల అభివృద్ధికి వీలు కలగనుందన్నారు. ఈ నిధులతో జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు వెళ్లేరోడ్లు బాగుకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న 676 వంతెనల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే ఈ ప్రాజెక్టులో 70 శాతం అనగా 4 వేల 480 కోట్లు ఎన్డీబీ రుణం కాగా.. మిగిలిన 30 శాతం 19 వందల 72 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంది.
రెండేళ్లు కావొస్తున్నా పూర్తి కాని పనులు.. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రుణం మంజూరైంది. ఆయా రహదారులకు మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. రెండు దశలుగా పనులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2021లో చేపట్టిన మొదటి దశలో 12 వందల 44 కిలో మీటర్ల విస్తరణ.. 204 వంతెనల నిర్మాణం ఇప్పటికి పూర్తి కాలేదు. 2020 అక్టోబర్ 28న అప్పటి రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు త్వరలోనే మొదటి దశ పనులు ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. కానీ రెండేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
ప్రారంభం కాని పనులు.. రెండో దశ కింద 13 ఉమ్మడి జిల్లాల్లో.. 12 వంద 67 కిలో మీటర్ల రహదారుల విస్తరణ, 253 వంతెనల నిర్మాణ పనులను ప్రతిపాదించారు. వీటికి 3 వేల 886 కోట్ల 14 లక్షల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో రాష్ట్ర వాటా వెయ్యి 16 కోట్లు కాగా.. మిగిలినది ఎన్డీబీ రుణంగా ఇస్తుంది. ఇందుకోసంఆర్ అండ్ బీ అధికారులుజిల్లాల వారీగా.. 119 రహదారులను ఎంపిక చేసి, 2021 ఆగస్టులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి సర్కారు పరిపాలన అనుమతి ఇచ్చాకే టెండర్లు నిర్వహించి, గుత్తేదారులకు పనులు అప్పగించే వీలుంటుంది. కానీ.. దాదాపు రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఈ దస్త్రంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర వాటా కింద వెయ్యి 16 కోట్లు సమకూర్చడం కష్టమేనని గతంలో ఆర్థికశాఖ అధికారులు.. ఆర్అండ్ బీ అధికారుల వద్ద అభిప్రాయపడినట్లు తెలిసింది.
దశ పనులే నత్తనడకన..ఆలస్యం చేసే కొద్ది అంచనా వ్యయాలు పెరిగిపోతాయని, రాష్ట్ర వాటా మొత్తం కూడా పెరుగుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. మొదటి దశ పనులే నత్తనడకన సాగుతుండగా, ఇక రెండో దశకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.అధికారంలోకి వచ్చిన కొత్తలో హడావిడి చేసిన జగన్ సర్కార్.. రాష్ట్ర వాటా చెల్లించాల్సిన సమయానికి చల్లబడిపోయింది.