తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - chilakaluripeta mla
యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద రహదారి ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని వెంటనే స్పందించారు. కానీ మార్గమధ్యంలోనే భార్య మృతి చెందింది.
కాళ్ల పారాణి ఆరకముందే భార్య తన కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడంతో భర్త విషాదంలో మునిగాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన గుడిపల్లి కోటేశ్వరరావుకు గత ఫిబ్రవరి 14వ తేదీన తెనాలి సమీపంలోని ఎడ్లపల్లికి చెందిన శ్రావణితో వివాహం జరిగింది. ఇటీవల శ్రావణి సొంత ఇంటికి వెళ్ళింది. భార్యను తీసుకుని వచ్చేందుకు భర్త కోటేశ్వరరావు అత్తారింటికి వెళ్ళాడు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై భార్య శ్రావణితో కలసి కోలలపూడికి బయల్దేరాడు. మార్గమధ్యంలో తిమ్మాపురం వద్ద గుర్తుతెలియని కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో శ్రావణి(20) తలకు తీవ్ర గాయాలు కాగా కోటేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో గుంటూరు వైపు వెళుతున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని వెంటనే స్పందించారు. అంబులెన్సుకి ఫోన్ చేసి పిలిపించారు. వైద్యులకు చరవాణిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అయితే శ్రావణిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే సమయానికి ఆమె మృతి చెందింది.. గాయపడిన కోటేశ్వరరావుకు ప్రాథమిక చికిత్స అందించారు. వివాహం జరిగి నాలుగు నెలలు గడవక ముందే ప్రమాదంలో భార్యను కోల్పోయిన కోటేశ్వరరావు ఆందోళనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి కోటేశ్వరరావును ఓదార్చారు.