Rising Prices of Essentials: నిన్న మొన్నటి వరకు కూరగాయల ధరలతో అవస్థలు పడిన పేద, మధ్య తరగతి ప్రజలను.. ప్రస్తుతం కందిపప్పు ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కిలో కందిపప్పు రేటు బహిరంగ మార్కెట్‌లో 200 రూపాయలకు చేరడంతో.. ఏమి కొనేటట్టు లేదు ఏమి తినేటట్టు లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో సామాన్యులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇంటి అద్దె, పన్నులు, కరెంటు బిల్లు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో జీవనం సాగించడమే కష్టమవుతోందని ఆవేదన చెందుతున్నారు.
ఉన్నట్టుండి కందిపప్పు ధర అమాంతంగా పెరిగితే బతికేదెలా అని వాపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యావసర ధరలను అదుపు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ నేడు ఆ హామీని తుంగలో తొక్కారని మహిళలు వాపోతున్నారు. గ్రామాల్లో సరైన ఉపాధి లేక పట్టణాలు, నగరాలకు వలస వస్తున్న వేతన జీవులు నిత్యావసరాల పెరుగుదలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే గానీ కుటుంబం గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Increased prices: ఈ బాదుడుకు సామాన్యులు బతికేదెలా.. భారీగా పెరుగుతున్న వంటింటి ఖర్చు
నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో వాటిని లాక్కుంటోందని పేదలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకే ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయని వాపోతున్నారు. రెండు వారాల క్రితం మొదటి రకం కందిపప్పు కిలో 145కు లభిస్తే ప్రస్తుతం 175 రూపాయలకు చేరిందని వివరిస్తున్నారు.
పప్పులు, బియ్యం వంటి కనీస అవసరాలైన సరుకులు ధరలు అందుబాటులో లేకపోతే ఏం తిని బతకాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయని ఆనందించిన కొద్ది రోజుల్లోనే పప్పులు, బియ్యం ధరలు చుక్కులు చూపిస్తున్నాయని వాపోతున్నారు. బలవర్థక ఆహారంగా చెప్పుకునే కందిపప్పు ధరపై ప్రభుత్వాల నియంత్రణ అవసరమని సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు.