Revanth reddy review meeting: తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జోడో యాత్ర తెలంగాణకు వచ్చినప్పటికీ.. యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతో కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొనియాడారు. ఇవాళ భారత్ జోడోయాత్రపై కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ఈ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శిలు బోసురాజు, రోహిత్ చౌదరి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఆర్.దామోదర్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో ఈ నెల 5, 6 తేదీలల్లో మాత్రమే తెలంగాణలో జోడో యాత్ర కొనసాగుతుందని, 5వ తేదీన సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుందని, 6వ తేదీన కార్నర్ మీటింగ్ ఉండదని రేవంత్రెడ్డి వివరించారు. 7వ తేదీన వీడ్కోలు సమావేశం అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే రోజున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ వద్ద కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి అడుగు పెట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకు తెలంగాణ సమాజం నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీకి అడుగడుగున అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.