ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers Protests Against R-5 Zone: ఆర్‌-5 జోన్‌పై రైతుల పోరాటం.. అంబేడ్కర్‌ స్మృతివనానికి వెళ్లకుండా అడ్డగింత - ఏపీ వార్తలు

Farmers Protests Against R-5 Zone:ఆర్‌-5 జోన్‌ను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. 144 సెక్షన్‌ పేరుతో శిబిరాల నుంచి రైతులు బయటికి రాకుండా.. పోలీసులు ఉక్కుపాదం మోపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామని రైతులు హామీ ఇచ్చినా.. పోలీసులు అంగీకరించలేదు. పోలీసులు, అన్నదాతలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దొండపాడులో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని బెదిరించి, భారీగా బలగాలు మోహరించి..అదుపులోకి తీసుకున్నారు. తర్వాత టెంట్లు లాగిపడేసి జంగిల్‌ క్లియరెన్స్ పనులు చేపట్టారు.

Restrictions on farmers struggle over R5 zone
ఆర్‌ 5 జోన్‌పై రైతుల పోరాటంపై ఆంక్షలు

By

Published : May 14, 2023, 7:10 AM IST

Updated : May 14, 2023, 8:55 AM IST

ఆర్‌-5 జోన్‌పై రైతుల పోరాటంపై ఆంక్షలు

Farmers Protests Against R-5 Zone:ఆర్‌-5 జోన్‌ పేరుతో అమరావతిని విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. రాజధానిలో ఆర్‌-3 జోన్‌లో పేద వర్గాలకు భూములు కేటాయించినా మళ్లీ కొత్త జోన్‌ ఏర్పాటు చేయటాన్ని రైతులు తప్పుబట్టారు. హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా రైతులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈలోగా సీఆర్డీఏ అధికారులు ఆర్‌-5 జోన్‌లో లేఔట్‌ అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. రైతుల అభ్యంతరాలు పట్టించుకోకుండా పనులు నిర్వహిస్తున్నారు. మొదట్లో ఇచ్చిన భూములు చాలవన్నట్లు దొండపాడు, నెక్కల్లు ప్రాంతాల్లో మరో 268 ఎకరాలు కేటాయించారు.

ఇప్పుడు అక్కడ కూడా లేఔట్లు వేయటానికి సీఆర్డీఏ అధికారులు రాగా రైతులు అడ్డుకున్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కనే ఉన్న భూముల్లో ఇలా సెంటు భూమి పేరిట పంపిణీ చేయటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వరాజ్యరావు, రాజధాని ఐకాస నాయకులు ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ తుళ్లూరు నుంచి అంబేడ్కర్‌ స్మృతి వనం వరకూ పాదయాత్ర నిర్వహించారు. పోలీసుల ఆంక్షలు లెక్కపెట్టకుండా కంపచెట్లు గుచ్చుకుంటున్నా, రైతులు పాదయాత్ర చేశారు. ఎంతకీ పరిస్థితి సద్దుమణగకపోవడంతో పోలీసులే ఓ వాహనంలో కొందరు రైతులను అంబేడ్కర్‌ స్మృతివనానికి తీసుకెళ్లారు. దీంతో వారు అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి గోడు వెళ్లబోసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదల్ని ముందుపెట్టి అమరావతి రైతుల్ని దోషులుగా చేయాలని చూస్తోందని రైతులు ఆరోపించారు. రాజధానిలో ఉపాధి లేకుండా ఉన్నవారికి ముందు మార్గం చూపాలని డిమాండ్‌ చేశారు. పేదల కోసం నిర్దేశించిన ఆర్‌-3 జోన్‌లో పక్కా ఇళ్లు కట్టించకుండా అమరావతిని నాశనం చేసేందుకే ఆర్‌-5 జోన్‌ సృష్టించారని ధ్వజమెత్తారు.

దొండపాడు, నెక్కల్లు ప్రాంతాల్లో పేదల ప్లాట్లకు కేటాయించిన భూములు ఎస్‌-3 జోన్‌ పరిధిలోకి వస్తాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆ భూమిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించాల్సి ఉండగా ఇప్పుడు ఇళ్ల స్థలాలకు కేటాయించటంపై రైతులు భగ్గుమన్నారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఆర్డీఏ అధికారులు జేసీబీలతో రాగా ప్రభుత్వం తమకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా సెంటు భూమి పేరుతో పంపిణీ చేయడం ఏంటి అంటూ రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు తప్పుబట్టారు. వందలాది మంది పోలీసులు రైతుల శిబిరాన్ని చుట్టుముట్టారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వావాదం జరిగింది. అనంతరం పోలీసులు బలవంతంగా రైతులను వాహనాల్లోకి ఎక్కించి టెంట్లు లాగిపడేశారు. వాటిని వాహనాల్లో వేసి తరలించారు. ఎవరు ఎదురు మాట్లాడితే వారిని అరెస్టు చేస్తామని బెదిరింపులకు దిగారు.
పోలీసుల తీరుపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. తమ భూముల్లో నిరసన తెలుపుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. రాజధాని లేని రాష్ట్రానికి భూములివ్వడమేనా మేము చేసిన పాపమా అంటూ ప్రశ్నించారు.

రైతుల్ని చెదరగొట్టి పంపించిన తర్వాత అధికారులు జేసీబీలతో కంపచెట్లు తొలగించారు. ఆ తర్వాత భూమి చదును చేయటం, కొలతలు తీసి రహదారులు వేయటం, ప్లాట్లు విభజించటం, సరిహద్దు రాళ్లు పాతే పనులు చేయనున్నారు. సోమవారం నాడు ఆర్‌-5 జోన్‌ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటి వరకైనా పనులు ఆపాలని రైతులు చేసిన విజ్ఞప్తిని అధికారులు, పోలీసులు పెడచెవిన పెట్టి మొండిగా ముందుకు వెళుతున్నారు.

"మీకు నిజమైన ప్రేమ ఉండే ఆర్-3 జోన్​ ప్రొవిజన్ పదిహేడు వందల ఎకరాలు ఉంది. దాంట్లో పక్కా ఇళ్లు కట్టి ఇట్టి ఇస్తే వాళ్లు సంతోషిస్తారు."- స్వరాజ్యరావు, రాజధాని ఐకాస నేత

"ఇక్కడికి కొత్తగా ఆర్-5 జోన్ అని తీసుకువచ్చారు. సెంటు భూమి అని 50 వేల మందితో ఇక్కడి పాగ వేస్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డికి పేదల మీద ప్రేమ లేదు. వారి ఓట్ల కోసం ఇక్కడ పాగ వేస్తున్నారు."- పులి చిన్నా, రాజధాని దళిత రైతు

ఇవీ చదవండి

Last Updated : May 14, 2023, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details