రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద పెరిగింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లోకి గరిష్ఠస్థాయి నీటి మట్టం చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 37,150 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 810.50 అడుగులు ఉండగా.. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 34.6077 టీఎంసీలు ఉండగా.. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. 24 గంటల్లో ఎడమ జల విద్యుత్కేంద్రంలో 3.144 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసి.. 7,063 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.
గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగింది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 43.20 టీఎంసీలు ఉండగా.. పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఎగువ నుంచి పులిచింతలకు 14,130 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.