తమ భూములను కాపాడాలంటూ చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ రైతులు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలకు వినతి పత్రం అందించారు. గుంటూరు వెళ్తున్న ఎంపీని యడవల్లి వద్ద ఆపి.. రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా.. మైనింగ్ పేరుతో తమ భూములను జిల్లా అధికారులు సర్వే చేస్తున్నారని ఆరోపించారు. అధికారులను వివరాలు అడిగితే సరైన సమాధానం చెప్పకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని బాధిత రైతులు వాపోయారు.
1975వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, ఆనాటి జిల్లా కలెక్టర్ కత్తి చంద్రయ్య.. యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారని రైతులు ఎంపీ చెప్పారు. గ్రామంలోని 120 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు 416 ఎకరాల ఏకపట్టా భూమిని ఇచ్చారన్నారు. అప్పటి నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలోనూ.. తమ భూముల్లో మైనింగ్ ప్రయత్నాలు జరిగినప్పుడు ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ను ఆశ్రయించామని పేర్కొన్నారు.