రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ... గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ పరిరక్షణ దినం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్.. తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేడ్కర్ స్ఫూర్తిని పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘంపైనా, న్యాయ వ్యవస్థపైనా దాడి చేస్తుండటమే అందుకు నిదర్శనమని అన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ.. ప్రజలు జీవించే హక్కును కాలరాసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా తమకు ఓట్లేసి గెలిపించిన దళితుల పైనే ప్రభుత్వం, పోలీసులతో దారుణంగా దాడులు చేయిస్తోందని విమర్శించారు. స్వతంత్రంగా వ్యవహరించే ఎన్నికల సంఘం విధుల్లోనూ.. జోక్యం చేసుకున్నారని.. అందుకే సుప్రీంకోర్టులో మొట్టికాయలు పడ్డాయన్నారు.
భాజపా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ..
భారత రాజ్యాంగం ఎంత శక్తివంతమైనదో ప్రస్తుతం మన రాష్ట్రంలో చూశామని భాజపా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులోని భాజపా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగం ప్రకారమే గత 72 సంవత్సరాలుగా దేశంలో పరిపాలన సాగుతోందని చెప్పారు. గ్రామస్థాయి వీఆర్వో నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ ఎవరేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని వివరించారు. ముఖ్య మంత్రి అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలని స్పష్టం చేశారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో..
గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో, అనంతరం గాంధీ పార్క్‌లో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ మువ్వన్నెలా జెండా ఆవిష్కరించారు. అనంతరం గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన పరేడ్‌లో పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో విధుల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బహుమతులు అందజేశారు.
గుంటూరు పోలీసు కవాతు మైదానంలో..
గుంటూరు పోలీసు కవాతు మైదానంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ శామ్యూల్ అనంద కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గుంటూరు జిల్లా అన్ని రంగాల్లోనూ ప్రగతి పథాన పయనిస్తోందని.. ముందు కూడా ఇదే స్ఫూర్తితో పని చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయని కలెక్టర్ ప్రశంసించారు. వివిధ శాఖలు ప్రగతిని చాటుతూ శకటాలు ప్రదర్శించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
గుంటూరు తెదేపా జిల్లా పార్టీ కార్యాలయంలో..
గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా జరుపుకొన్నారు. జాతీయ జెండాను, తెదేపా జెండాను తెదేపా నేతలు ఎగరవేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. దేశం అనేక రంగాల్లో ముందుకు అడుగులేస్తోందని.. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించాలని తెదేపా గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షడు తెనాలి శ్రావణ్‌కుమార్ ఆకాంక్షించారు. మహానుభావుల త్యాగఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా జీవితానికి కారణమన్నారు. భారత రాజ్యాంగం రాష్టంలో అములు కావడం లేదన్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని.. స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు నిన్న ఉన్నతన్యాయస్థానం ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. న్యాయస్థానాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ను రక్షిస్తున్నాయన్నారు.
గుంటూరు లాడ్జి సెంటర్లో..
గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన గణతంత్రదినోత్సవంలో అయన పాల్గొన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పలువురు వ్యక్తులు అవహేళన చేస్తున్నారని డొక్కా అన్నారు. రాష్ట్రంలో కొందరు వ్యక్తులు మతాలు, కులాలు మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఉద్యోగుల క్షేమం దృష్ట్యా ఎన్నికల వాయిదా వేయాలని కోరామే తప్ప.. ఎన్నికలు అంటే వణుకు బెణుకు లేదన్నారు. అధికారాలు ఎవరు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును, మాటను ధిక్కరించడం లేదని.. ఆరోగ్యపరంగా మాత్రమే భయపడుతున్నారన్నారు. అందుకే ఎన్నికల విధులు నిర్వహించలేమని ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహణపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.
తెదేపా ఆధ్వర్యంలో....
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులోని లాడ్జి సెంటర్లో తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా నేతలు తెనాలి శ్రావణ్‌కుమార్, కోవెలమూడి రవీంద్ర, నసిర్ అహ్మద్, జయలక్ష్మి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలో రాజ్యాంగాన్ని వైసీపీ నేతలు అపహాస్యం పాలు చేస్తున్నారని తెదేపా గుంటూరు పశ్చిమ సమన్వయకర్త కోవెలమూడి రవీంద్ర అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో వ్యవహరించిన తీరుతో ప్రజాధనం వృధాగా పోయిందన్నారు. నిన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు వంటిదన్నారు. భారత రాజ్యాంగాన్ని వైకాపా నేతలు ఖూనీ చేస్తున్నారని తెదేపా గుంటూరు తూర్పు సమానవ్యకర్త నసీర్ అహమ్మద్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన భాద్యత ప్రతిఒక్కరి పైన ఉందన్నారు.
ఇదీ చదవండి:'పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును భాజపా స్వాగతిస్తుంది'