తెదేపా పాలనలో రైతులకు వెన్నుదన్నుగా ఉంటే.. వైకాపా ప్రభుత్వం మాత్రం రైతుల వెన్ను విరిచేలా వ్యవరిస్తోందని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి, నగరం మండలాల్లోని పలు గ్రామాల్లో అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో కోతకు వచ్చిన పంట పూర్తిగా నీట మునిగిందని.. నష్టంపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెదేపా హయాంలో ప్రకృతి విపత్తులతో నష్టపోయిన ప్రతి రైతును అర్థికంగా ఆదుకున్నామన్నారు. గత సంవత్సరంలో అకాల వర్షాలకు నష్టపోయిన చాలా మంది రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రైతుల పట్ల వైకాపా చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు తెదేపా అండగా ఉంటుందన్నారు.